Kishan Reddy On Phone Tapping : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రగడ.. రాజకీయ దుమారం రేపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై రగడ జరుగుతోంది. నిఘా వర్గాలను మందలించే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ సరిపోవడం లేదా అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార టీఆర్ఎస్ నేతలను ఉలిక్కిపడేలా చేశాయి.

Kishan Reddy On Phone Tapping : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై రగడ జరుగుతోంది. నిన్న నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రావడంపై కిషన్ రెడ్డి అభ్యంతరంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

నిఘా వర్గాలను మందలించే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ సరిపోవడం లేదా అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార టీఆర్ఎస్ నేతలను ఉలిక్కిపడేలా చేశాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం.. బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందా? చేస్తే ఎవరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి? ఎవరి సంభాషణలను ఇంటెలిజెన్స్ అధికారులు వింటూ సమాచారాన్ని ప్రభుత్వాన్ని చేరవేస్తున్నారు అన్న అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

ఇన్ని రోజులుగా లేని ఫోన్ ట్యాపింగ్ అంశం.. ఇప్పుడు సడెన్ గా తెరమీదకు రావడంతో రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. పార్టీలో ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. గతంలో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని, ఇందుకు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కేంద్ర ప్రభుత్వంపై పార్టీల నేతల దుమ్మెత్తి పోశారు. ఈ అంశం పార్లమెంటును సైతం కుదిపేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది కూడా. ఇప్పుడు అదే తరహా ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చోప చర్చలు సాగుతున్నాయి. ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో ఐబీ అధికారులను పెట్టవలసి వస్తుందంటూ హెచ్చరిస్తూ, ఇందుకు సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించడం అధికార టీఆర్ఎస్ నేతలను ఇరకాటంలో పెట్టేలా ఉందన్న చర్చ నడుస్తోంది.

బీజేపీ సంగతి పక్కన పెడితే.. టీఆర్ఎస్ నేతలు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నది కిషన్ రెడ్డి వాదన. బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న కిషన్ రెడ్డి వాదనలను తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. కేంద్రమంత్రిగా కచ్చితమైన సమాచారంతోనే ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేసినా అది చట్టవిరుద్ధమే. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు అధికార పార్టీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు ఉన్నాయి.

నిజంగానే బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? లేక రాజకీయ లబ్ది కోసం కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారా? బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? ట్యాప్ అవుతుంటే.. ఎవరి సంభాషణలు వింటున్నారు? ఇప్పుడీ ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి.