ఓటమి భయంతో హరీష్ రావు, రఘునందన్ కుట్ర చేశారు.. అసత్య ప్రచారంపై ఉత్తమ్ ఆగ్రహం

  • Publish Date - November 3, 2020 / 12:51 PM IST

uttam kumar reddy on fake news: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రచారం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపపారు. దుబ్బాకలో పోలింగ్ మొదలు కాగానే ఈ దుష్ప్రచారం ప్రారంభించారని అన్నారు. ఓటమి భయంతో హరీష్ రావు, రఘునందన్ రావు ఈ కుట్ర చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారాయన. కేరళలలో ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తే గెలిచిన అభ్యర్థిని అక్కడి హైకోర్టు డిస్ క్వాలిఫై చేసిందని ఉత్తమ్ గుర్తు చేశారు. కేరళ హైకోర్టు తీర్పును ఎన్నికల కమిషనర్ కు ఇచ్చామని తెలిపారు.

డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అడిషనల్ సీఈవోను కలిశారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం పై ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ లోకి వచ్చేశారని టెన్ టీవీ వార్త పేరుతో సోషల్ మీడియాలో కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది టెన్ టీవీ. అటు అసత్య ప్రచారాలపై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అసత్య ప్రచారం టీఆర్ఎస్, బీజేపీ పనే అని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. 10 టీవీ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వార్తలను సృష్టించినా, అలాంటి వార్తలను షేర్ చేసినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

ప్రశాంతంగా పోలింగ్:
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. ఉదయం 11గంటల వరకు 34.33శాతం పోలింగ్ పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు:
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. దుబ్బాక మండలం బొప్పాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, తొగుట మండలం తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వీరి మధ్యనే నెలకొంది.

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే విజయం అని భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతారని అసత్య ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారని భట్టి విక్రమార్క చెప్పారు.