Digu Digu Digu Naaga : దిగు దిగు దిగు నాగ సాంగ్‌పై వివాదం.. సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్

''వ‌రుడు కావ‌లెను'' సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం ఈ చిత్రంలోని “దిగుదిగు దిగు నాగ” పాట.

Digu Digu Digu Naaga

Digu Digu Digu Naaga : ”వ‌రుడు కావ‌లెను” సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం ఈ చిత్రంలోని “దిగుదిగు దిగు నాగ” పాట.

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ‘దిగు దిగు దిగు నాగ’ లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో ‘దిగు దిగు దిగు నాగ’ అనేది చాలా పాపులర్ అయిన జానపద గేయం. నాగరాజుపై ప్రేమతో ఈ భజన గేయాన్ని పాడుకుంటారు. అయితే సినిమా పాట‌లో ‘కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా’ లాంటి పదప్రయోగాలు ఉపయోగించారు. దీనిపై వివాదం రాజుకుంది.

‘వరుడు కావలెను’ సినిమాను బ్యాన్‌ చేయాలని శనివారం బాచుపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ‘దిగు దిగు దిగు నాగ’ పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధరమ రక్షాదళ్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.

మరోవైపు ఇదే పాట వ్యవహారంలో పాటల రచయిత అనంత శ్రీరామ్ పై కేసు నమోదైంది. ఈ పాట దేవుడిని కించపరిచేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కేసు పెట్టారు. బీజేపీ మోర్చా నాయకులు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపించారు. అనంత శ్రీరామ్‌తో పాటు ఆ సినిమా యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివాదాల సంగతి ఎలా ఉన్నా, దిగు దిగు నాగ పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్ దక్కించుకుంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ‌శౌర్య‌, రీతూ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైంది. కొన్ని రోజుల్లో మూవీని విడుద‌ల చేయ‌నున్నారు.