×
Ad

Srisailam : హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేవారికి అలర్ట్..? రాకపోకలు బంద్.. కోతకు గురైన రోడ్డు..

Srisailam : హైదరాబాద్ - శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లతిపూర్ గ్రామం వద్ద

Srisailam : హైదరాబాద్ – శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లతిపూర్ గ్రామం వద్ద డిండి జలాశయం అలుగుపడి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపై బ్రిడ్జి కూలి పోవడంతో హైదరాబాద్ – శ్రీ శైలం హైవే ప్రధాన రహదారిపై రాకపోకలను అధికారులు బంద్ చేశారు. ఇరువైపులా భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ నుంచి వంగూరు మండలం చింతపల్లి కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లించారు. కోతకు గురైన జాతీయ రహదారిని నాగర్ కర్నూల్ ఎస్పీ పరిశీలించారు. దీనిపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు అధికారులు సమాచారం అందించారు.

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్లమల ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బుధవారం శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి రహదారిపై పడడంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్టు వద్ద వాహనాలను శ్రీశైలం వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పడిన బండరాళ్లను ప్రొక్లెయిన్ సహాయంతో తొలగించారు. ఆ తరువాత వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. అయితే, తాజాగా.. జాతీయ రహదారి కోతకు గురికావడంతో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కాగా.. అధికారులు ఆ ప్రాంతంలో భారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను వేరే ప్రాంతం నుంచి మళ్లించారు.


ఏపీలో తీరందాటి తెలంగాణ వైపు దూసుకొచ్చిన మొంథా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. భద్రాచలానికి 120 కి.మీ. దూరంలో, ఖమ్మంకు 180 కి.మీ. దూరంలో, ఒడిశాలోని మల్కన్ గిరికి 130 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీన పడుతుంది. కొన్నిగంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు.. తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాల్లో ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ అయ్యాయి.