దాని కోసమే అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ వాడుకుంది: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

అసెంబ్లీ సాక్షిగా తమ మహిళా నేతలను అవమాన పరిచారని అన్నారు. సీఎం, మంత్రులు అన్నీ అసత్యాలే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు రోజులు జరిగిన ఈ సమావేశాల్లో జీరో అవర్ లేనే లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కారని, బీఆర్‌ఎస్‌ను తిట్టించేందుకు సమావేశాలను కాంగ్రెస్ వాడుకుందని అన్నారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ లేదని, ఏడు నెలల్లో సీఎం రేవంత్ వికృత రూపం చూపించారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. తప్పుడు పత్రాలతో సీఎం అందరినీ తప్పుదోవ పట్టించారని తెలిపారు. సీఎం ఒక ఆటవిక రాజ్యాధికారిగా వ్యవహరించారని, కాంగ్రెస్ హామీల ఊసే బడ్జెట్‌లో లేదని చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అన్నారు.

జాబ్ క్యాలండర్‌కు చట్టబద్ధత తెస్తామన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తమ మహిళా నేతలను అవమాన పరిచారని అన్నారు. సీఎం, మంత్రులు అన్నీ అసత్యాలే చెప్పారని తెలిపారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అయినా భర్తీ చేస్తుందా అని నిలదీశారు. 75 కోట్ల రూపాయలతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానన్న భట్టిని కేంద్ర ఇరిగేషన్ మంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులు వెయ్యి కోట్లతో పూర్తి చేయవచ్చని చెప్పారు.

Also Read: ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది.. అధికారులపైనా చర్యలుంటాయి : సీఎం చంద్రబాబు నాయుడు

ట్రెండింగ్ వార్తలు