Vemulawada Donation Issue: వేములవాడ ఆలయంలో వింత ఘటన.. స్వామివారికి 7 లక్షల విరాళం.. వెనక్కివ్వండని వేడుకున్న కుమార్తెలు
వేములవాడకు చెందిన వృద్ధ దంపతులు రాజరాజేశ్వరస్వామిపై భక్తితో రూ. 7,01,116 నగదును విరాళంగా(Vemulawada Donation Issue) అందజేశారు.
- V Santhosh Kumar
- Published on- July 21, 2026 / 11:05 AM IST
Vemulawada temple donation controversy daughters request refund
- వేములవాడ రాజన్న ఆలయంలో ఘటన
- ఏడు లక్షల విరాళం సమర్పణ
- డబ్బులు వెనక్కి ఇవ్వాలని వేడుకోలు
Vemulawada Donation Issue: దైవభక్తితో ఆలయానికి భారీగా విరాళాలు సమర్పించడం సాధారణమే అయినా, వేములవాడలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏడుగురు కుమార్తెల పెళ్లిళ్లు చేసి శేష జీవితాన్ని గడుపుతున్న ఒక వృద్ధ దంపతులు, తమ వద్ద ఉన్న నగదునంతా రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు అందజేశారు. అయితే ఈ నిర్ణయం వారి కుటుంబంలో ఊహించని వివాదానికి దారితీసింది.
రాజన్న ట్రస్టుకు రూ.7.01 లక్షల విరాళం సమర్పణ:
వేములవాడకు చెందిన సదరు వృద్ధ దంపతులు రాజరాజేశ్వరస్వామిపై ఉన్న అపారమైన భక్తితో రూ. 7,01,116 నగదును ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళంగా(Vemulawada Donation Issue) అందజేశారు. ఆలయ అధికారులు శ్రీనివాస్ శర్మ, శ్రీనివాస్‌లు వారి నుంచి డబ్బులు స్వీకరించి అధికారిక రసీదును కూడా అందజేశారు. తమ జీవిత చరమాంకంలో దేవుని సేవకే ప్రాధాన్యం ఇస్తూ వారు ఈ విరాళం ఇచ్చారు.
అధికారులను ఆశ్రయించిన కుమార్తెలు:
ఈ విషయమంతా తెలిసిన వృద్ధ దంపతుల కుమార్తెలు ఆలయ అధికారుల వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రికి మతిస్థిమితం సరిగా లేదని, తల్లిదండ్రుల పోషణ, వైద్య ఖర్చుల కోసం ఆ డబ్బు ఎంతో అవసరమని తెలుపుతూ విరాళాన్ని వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే, దంపతుల స్వచ్ఛంద అంగీకారంతోనే విరాళం స్వీకరించామని, ఒక్కసారి స్వామివారికి సమర్పించిన నగదును తిరిగి ఇచ్చే నియమాలు లేవని అధికారులు స్పష్టం చేయడంతో వారు దిగులుతో వెనుతిరిగారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
