Vijayashanti: ఎమ్మెల్సీ టికెట్‌ దక్కింది సరే.. మంత్రి పదవి గురించి విజయశాంతి ఏమన్నారంటే?

సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు.

Vijayashanti

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైన విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌తో పాటు విజయశాంతికి ఆ పార్టీ అధిష్ఠానం టికెట్లు ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంతో దీనిపై 10 టీవీతో విజయశాంతి మాట్లాడారు. మంత్రి పదవి అంశం తనకు తెలియదని, హై కమాండ్ ఆలోచన ఏంటో తనకు తెలియదని అన్నారు. తనకు ఎమ్మెల్సీగా కొత్త ఉద్యోగం ఇచ్చారని, ఈ ఉద్యోగాన్ని సరిగ్గా చేయాలని వ్యాఖ్యానించారు.

ఉద్యమ నాయకురాలికి అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని అన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలని చెప్పారు. “ఈ రోజు మొదటి రోజే. మున్ముందు ఎలా ఉంటుందో చూద్దాం” అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ఈ విషయాన్ని తాను చాలా కాలం నుంచి చెబుతున్నానని విజయశాంతి తెలిపారు.  ప్రతిపక్షాల ఆటలు ఇక చెల్లవని విజయశాంతి అన్నారు. తాను ఎన్నడూ పదవుల వంటివి కావాలని పార్టీని అడగలేదని చెప్పారు.

పార్టీ అధిష్ఠానం తనకు ఏ అవకాశం ఇచ్చినా తనకు పదవుల వంటివి వద్దని, తాను ముందు పనిచేస్తానని చెప్పానని విజయశాంతి తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు.

తెలంగాణ ఖజానాకు కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారని విజయశాంతి అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి వెళ్లారని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీకి, కాంగ్రెస్ హై కమాండ్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.