Vikarabad Collector Incident (Photo Credit : Google)
Vikarabad Collector Incident : లగచర్ల ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో మరికొందరిని అరెస్ట్ చేశారు. ఆరుగురిని కొడంగల్ పోలీస్ స్టేషన్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. అరెస్ట్ చేసిన వారిని సాయంత్రం రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మరికొందరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
లగచర్ల ఘటనలో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారుల నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఐజీ సత్యనారాయణతో పాటు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేశ్ భగవత్ తో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి దర్యాఫ్తు కొనసాగుతోంది. ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. వారిలో కొందరిని సంగారెడ్డి జైల్లో, కొందరిని పరిగి జైల్లో, మరికొందరిని చర్లపల్లి జైల్లో ఉంచారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ కోరుతూ వికారాబాద్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. అటు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్ ను క్వాష్ చేసేలే ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
లగచర్ల ఘటనలో ఒకవైపు దర్యాఫ్తు కొనసాగుతుంటే, మరోవైపు గ్రామస్తులు పదే పదే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ భూములను అక్రమంగా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందంటూ బాధితులు మీడియా ముందుకు వచ్చారు. నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు లగచర్ల గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా వారు కొన్ని అంశాలను పొందుపరిచారు.
ఆడవాళ్లు అని కూడా చూడకుండా పోలీసులు తమతో అమానుషంగా వ్యవహరించారని, అర్థరాత్రి ఇళ్లలోకి వచ్చి తమ భర్తలను అన్యాయంగా అరెస్ట్ చేసి, అక్రమ కేసులు పెడుతున్నారని, ఇదంతా ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తోందని, అమాయకులైన గిరిజనుల భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంటూ గిరిజన మహిళలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు తమ వాదనలు వినిపించారు.
Also Read : ఇదేందయ్యా ఇది.. గాడిద పాల పేరుతో రూ.100 కోట్ల మోసం.. ఎలా చీట్ చేశారంటే..