×
Ad

Suryapet District: ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ను బంధించిన గ్రామస్తులు.. సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత..

పొరపాటు జరిగిందని, తమను క్షమించాలని అధికారి కోరడంతో గ్రామస్తులు శాంతించారు.

Suryapet District: ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ను గ్రామస్తులు బంధించిన ఘటన సూర్యాపేట జిల్లా సీతారామపురంలో జరిగింది. ఆర్‌వో అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఉప సర్పంచ్‌ పేరు ప్రకటించారు ఆర్వో నాగరాజు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు సదరు ఆర్వోను నిలదీశారు. ఇదే క్రమంలో అధికారి బయటకు వెళ్లకుండా పంచాయతీ కార్యాలయం గేటుకి తాళం వేసి బంధించారు గ్రామస్తులు. దాంతో అధికారి దిగొచ్చాడు. పొరపాటు జరిగిందని, తమను క్షమించాలని కోరడంతో గ్రామస్తులు శాంతించారు. గేటు తాళం తీసి అధికారిని వదిలిపెట్టారు.

నిన్న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అయితే, సీతారామపురంలో వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు చేరుకోకముందే రిటర్నింగ్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి. సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఉప సర్పంచ్ గా పలానా అభ్యర్థిని ఎన్నుకున్నారు అని ఆర్వో ప్రకటించేశారు. దీంతో సభ్యులు షాక్ కి గురయ్యారు. ఆందోళనకు దిగారు. వార్డు సభ్యులుగా ఉన్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి ప్రక్రియ చేపట్టకుండానే ఉప సర్పంచ్ ని ఎలా ప్రకటిస్తారని వార్డు సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

ఆర్వో నాగరాజుతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో పంచాయతీ కార్యాలయంలోనే ఆయనను ఉంచేసి గేటుకి తాళం వేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, పెద్ద మనషులు వారికి నచ్చ చెప్పారు. అలాగే అధికారి తీరును తప్పుపట్టారు. ఎందుకిలా చేశారని పెద్ద మనుషులు ప్రశ్నించారు. దాంతో తప్పు జరిగిపోయిందని, తనను క్షమించాలని ఆర్వో నాగరాజు కోరారు. సమాచార లోపంతో ఇలా జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో వార్డు సభ్యులు, గ్రామస్తులు శాంతించి ఆందోళనను విరమించారు. గేటు తాళం తీసి ఆర్వోని విడుదల చేశారు.

Also Read: హస్తం పార్టీ ఎమ్మెల్యేల సొంతూర్లలో షాకింగ్ రిజల్ట్స్‌..! ఇందుకేనా?