Vinfast Showroom Issue: రూ.25 లక్షలుపెట్టి కారు కొంటే.. షోరూమ్ దాటకముందే కాలిపోయింది.. ఇదేంటని అడిగినందుకు..
హైదరాబాద్ రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ షోరూమ్(Vinfast Showroom Issue)లో కారు కొనుగోలు చేసిన ఒక కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
- V Santhosh Kumar
- Updated on- June 16, 2026 / 09:15 AM IST
Vinfast showroom negligence customer files police complaint
- రూ.25 లక్షల కొత్త కారు కొనుగోలు.
- కేవలం 500 మీటర్లకే ఆగిపోయింది.
- షోరూమ్ నిర్వాహకులపై పోలీస్ ఫిర్యాదు.
Vinfast Showroom Issue: హైదరాబాద్ రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ షోరూమ్‌లో కారు కొనుగోలు చేసిన ఒక కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొత్త కారు డెలివరీ తీసుకుని షోరూమ్ వెలుపలికి రాగానే అది మధ్యలోనే ఆగిపోయింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ షోరూమ్ నిర్వాహకులను సంప్రదించగా, వారు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు చివరకు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
బాధితుడు యండమూరి ప్రకాష్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ఈ నెల 2న రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ షోరూమ్(Vinfast Showroom Issue)లో రూ.25 లక్షల విలువైన విన్‌ఫాస్ట్ ఈవీ (EV) కారును కొనుగోలు చేశారు. అయితే, కారు తీసుకుని కేవలం 500 మీటర్ల దూరం వెళ్లగానే అది నిలిచిపోయింది. షోరూమ్ మెకానిక్ వచ్చి పరిశీలించగా కారు మోటార్ కాలిపోయినట్లు తేలింది. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా, తమకు సంబంధం లేదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా కొత్త కారు మార్చి ఇవ్వాలని కస్టమర్ కోరినా షోరూం నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో సోమవారం ఆయన షోరూమ్ ముందే నిరసనకు దిగారు. ఈ క్రమంలో షోరూమ్ సిబ్బంది కస్టమర్‌తో గొడవకు దిగడంతో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయం చేయాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
