భద్రకాళి ఆలయ అభివృద్ధి నమూనా
Bhadrakali Temple: వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయంకు మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ఆలయాన్ని తమిళనాడు రాష్ట్రం మధురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయం నమూనాలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ.54కోట్లతో ఇటీవల పనులుసైతం ప్రారంభమయ్యాయి. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షిస్తున్నారు.
Also Read: కంచ భూముల వెనకున్న ఆ బీజేపీ ఎంపీ ఎవరు? రోజుకో మలుపు తిరుగుతున్న భూముల వ్యవహారం
1986లో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం, మహామండపం, సాలహారాలను నిర్మించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత భద్రకాళి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయ చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. మధురైతో పాటు తంజావూరుకు చెందిన స్తపతులతో త్వరలోనే దేవాదాయ శాఖ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
దేవాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి ఖాళీ స్థలాలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. ప్రత్యేక రోజుల్లో అమ్మవారి ఊరేగింపులు, వాహన సేవలకు ఉపయోగపడేలా ఆలయం చుట్టూ 30అడుగుల వెడల్పుతో మూడవీధుల డిజైన్ లను ఖరారు చేశారు. ఇందుకోసం రూ.30కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. మరోవైపు ఆలయం నాలుగువైపులా రాజగోపురాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.24కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.