TGSRTC Driver: వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
TGSRTC Driver Suicide Attempt: గమనించిన తోటి సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శంకర్ ను ఆసుత్రికి తరలించారు.
- Naveen
- Updated on- April 23, 2026 / 05:04 PM IST
Warangal RTC Driver Suicide Attempt
TGSRTC Driver Suicide Attempt: వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న నర్సంపేట పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేశాడు. గత రెండు రోజులుగా డ్రైవర్ శంకర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. అయితే, ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో శంకర్ తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. బస్టాండ్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శంకర్ ను ఆసుత్రికి తరలించారు.
ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు ఆర్టీసీ కార్మికులు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని ఆర్టీసీ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఎంజీఎంకు చేరుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంజీఎంకు వెళ్లి తీవ్రంగా గాయపడ్డ కార్మికుడిని పరామర్శించారు. అటు కలెక్టర్ సత్య శారద, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సైతం వరంగల్ ఎంజీఎంకు చేరుకున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే ప్రధాన డిమాండ్ తో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ఎదుట మహా ధర్నాకు యూనియన్లు పిలుపునిచ్చాయి. దీంతో పలు ఆర్టీసీ డిపోల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. డిపోల నుంచి వస్తున్న బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.
Also Read: అధిక వడ్డీ కేసులో బిగ్ ట్విస్ట్.. సింగర్ మంగ్లీ సోదరుడి వల్ల ప్రాణభయం ఉందంటూ సంచలన ఆరోపణలు..
కాగా, బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు దగ్గరుండి బస్సులను రన్ చేస్తున్నారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
