Mangli Microfinance Scam : అధిక వడ్డీ కేసులో బిగ్ ట్విస్ట్.. సింగర్ మంగ్లీ సోదరుడి వల్ల ప్రాణభయం ఉందంటూ సంచలన ఆరోపణలు..
Mangli Microfinance Scam : నల్లగొండ జిల్లాలో వెలుగు చూసి మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్, సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై సంచలన ఆరోపణలతో సెల్ఫీ వీడియో విడుదల చేసిన మాజీ క్యాషియర్.
micro finance scam former cashier release selfie video and alleges life threat from singer mangi brother
Mangli Microfinance Scam : నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన అధిక వడ్డీ దందా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మాజీ క్యాషియర్ రమేష్ నాయక్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. దీంతో సింగర్ మంగ్లీ సోదరుడి పేరు మరోసారి తెర మీదకు వచ్చింది. మంగ్లీ సోదరుడి వల్ల తనకు ప్రాణ భయం ఉందంటూ రమేష్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు.
రమేష్ నాయక్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిలో మంగ్లీ సోదరుడు శివ చౌహాన్, రమావత్ మధు నాయక్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. అధిక వడ్డీ ఆశచూపి అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తాను ఇచ్చిన రూ. 50 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
మధు నాయక్ తో సింగర్ మంగ్లీకి అత్యంత సాన్నిహిత్యం ఉందని.. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని బాధితుడు సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. వీరి అక్రమాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన రమేష్.. త్వరలోనే పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్ ను కలిసి వీరందరి అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు.
