Himayath Sagar – Osman Sagar : తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి.
ప్రధానంగా హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,760 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,756 అడుగులుకు చేరుకుంది. దీంతో గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను, అప్రమత్తం చేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, జలమండలి అధికారులు సాగర్ ను పరిశీలించారు. రంగారెడ్డి జల్లా పరిసర ప్రాంతాల్లో చెరువులు నిండడంతో హిమాయత్ సాగర్ కు వరద నీరు పోటెత్తింది.
పరిస్థితిని ఎప్పటికప్పుడు రెవెన్యూ, జలమండలి అధికారులు సమీక్షిస్తున్నారు. 2010లో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ కు కూడా వరద నీరు పోటెత్తుతోంది.