Rain Alert : ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్… నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. భీకర గాలులు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harish Thanniru
- Updated on- September 6, 2026 / 07:33 AM IST
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : AP Municipal Act: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక మార్పులు.. ఇకపై ఈవీఎంలతోనే పోలింగ్.. కొత్త జీవోలు విడుదల
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కదలికలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో నేడు, రేపు వాతావరణం కాస్త చల్లబడి ఉంటుంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ, పశ్చిమ జిల్లాలైన మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. మరోవైపు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి పరిసరాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
