వానలు బాబోయ్.. ఇంకెన్నాళ్లు ఈ దంచికొట్టుడు.. వాతావరణ శాఖ బిగ్ అప్ డేట్..

నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

Telangana rains: జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నదుల్లా పారింది. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముషీరాబాద్ సర్కిల్ తాళ్లబస్తీలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిలకలగూడ, బోలక్‌పూర్ ప్రాంతాల్లో 15 నుంచి 18 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

బేగంపేట్, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్, చందానగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 11 నుంచి 13 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. మూసాపేట్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కాప్రా సర్కిళ్ల పరిధిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసఫ్‌గూడా, కార్వాన్, కుత్బుల్లాపూర్, మెహిదీపట్నం ప్రాంతాల్లో 7-8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు.

మరో 3 రోజులు ఇంతే

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మరో 3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత్ నుంచి రుతుపవనాలు తిరోగమనం చెందుతున్నాయి. వచ్చేనెల 1 నాటికి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి.

నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్

సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రేపు హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

ఏపీలోనూ..

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.