కాంగ్రెస్‌కు రాములమ్మ దూరమైనట్టేనా? దుబ్బాక ఉపఎన్నిక వేళ చర్చకు దారితీసిన విజయశాంతి ప్రెస్ నోట్

  • Publish Date - November 3, 2020 / 11:39 AM IST

what happend to vijayashanti: అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ వేళ కాంగ్రెస్ నేత విజయశాంతి విడుదల చేసిన ప్రెస్ మీట్ చర్చనీయాంశంగా మారింది. ఆలోచించి ఓటు వేయాలని దుబ్బాక ఓటర్లకు సూచించారు విజయశాంతి. అయితే ప్రెస్ నోట్ లో కాంగ్రెస్ పేరు మాత్రం ప్రస్తావించ లేదు. అంతేకాదు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కూడా విజయశాంతి ప్రస్తావించ లేదు.

కేవలం తన పేరుతో మాత్రమే ఆమె పోస్ట్ చేయడం గమనార్హం. గతంలో చేసిన పోస్టుల్లో తనను కాంగ్రెస్ నేతగా చెప్పుకున్న విజయశాంతి, ఇప్పుడు మాత్రం అలా చేయకపోవడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. తాజా పరిణామంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి దూరమైందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు రాములమ్మకు ఏమైంది అని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.

కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. గాంధీభవన్ వైపు కూడా చూడటం లేదు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పేరు ప్రస్తావించకుండా విజయశాంతి విడుదల చేసిన ప్రెస్ నోట్ ఆ అనుమానాలకు మరింత బలాన్ని ఇచ్చింది.