Dharani Portal : ధరణి పోర్టల్‌లో సమస్యలు, ఫిర్యాదులకు వాట్సాప్ నెంబర్

ధరణి పోర్టల్‌ సంబంధ సమస్యలు, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌, ఈ-మెయిల్‌ అందుబాటులోకి తెచ్చింది.

Dharani Portal : ధరణి పోర్టల్‌ సంబంధ సమస్యలు, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌, ఈ-మెయిల్‌ అందుబాటులోకి తెచ్చింది. రైతులకు ఏమైనా ఫిర్యాదులుంటే ascmro@telangana.gov.in కు మెయిల్ చేయొచ్చు. లేదా 9133089444 నంబర్‌కు వాట్సాప్‌ చేయొచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

సమయభావం లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని సోమేష్ కుమార్ చెప్పారు. సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగాల అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌ సమస్యలపై సమీక్షించిన సీఎస్‌.. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

భూముల వివరాల్లో, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫిర్యాదులతో పాటు భూముల వివరాల్లోని సమస్యలను సులభంగా ఉన్నతాధికారులకు చేరవేయడానికి వాట్సాప్, ఈమెయిల్ తీసుకొచ్చామని, వీటిని ఉపయోగించి ధరణి పోర్టల్ ఫిర్యాదులను పంపొచ్చని వివరించారు.

భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న ఆవిష్కరణే ధరణి పోర్టల్. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, త్వరితగతిన పరిష్కారాలు చూపడానికి, భూముల వివరాలు పొందడానికి ధరణి పోర్టల్ ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా భూముల వివరాలన్నీ ధరణి పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. భూమికి సంబంధించి రిజిస్ట్రేన్ల స్లాట్ల దగ్గర నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు ఇందులో ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లను పొందుపరుస్తూ ధరణి పోర్టల్ కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు