Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య లేదు: ప్రియాంక గాంధీ

ఇందిరాగాంధీ చనిపోయే సమయంలో తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్నారు. ఐటీడీఏ స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పొడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జల్ జంగల్ జమీన్ పై హక్కులు ఆదివాసులకే ఉండాలని ఇందిరా అన్నారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‭గఢ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం కొమురం భీం జిల్లా అసిఫాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పారు.

‘‘ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకోసం పని చేయాలి. కానీ ఇక్కడి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఛత్తీస్‭గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ నిరుద్యోగ సమస్య లేదు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మరో లక్ష ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. కర్ణాటక ప్రభుత్వంపై విమర్శ చేస్తున్న కేసీఆర్… తెలంగాణలో పదేళ్లుగా ఏం చేశారు? కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. ఇక్కడున్నది స్కాంల ప్రభుత్వం’’ అని ప్రియాంక అన్నారు.


ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇందిరాగాంధీ చనిపోయే సమయంలో తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్నారు. ఐటీడీఏ స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పొడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జల్ జంగల్ జమీన్ పై హక్కులు ఆదివాసులకే ఉండాలని ఇందిరా అన్నారు. యూపీఏ ప్రభుత్వంలోనే అటవీ హక్కు చట్టం ఏర్పాటు చేశారు. తెలంగాణ సొంత రాష్ట్రం కలనీ నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తాం. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట రైతులను కాపాడుకుని వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాం’’ అని అన్నారు.