AIMIM: మైనార్టీ ఓట్ల చీలికకు మజ్లిస్ వ్యూహం.. మిత్రపక్షం గెలుపు కోసం ఎంఐఎం అధినేత ఎత్తుగడ

రాష్ట్రంలో 50 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన మజ్లిస్.. తాజాగా ఆ ఊసెత్తకపోగా.. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతోపాటు కొత్తగా రెండు సీట్లలో పోటీ చేస్తామన్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Who benefits from AIMIM contest in Telangana polls

Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన MIM పార్టీ.. వెనక్కు తగ్గింది. తనకు బలం ఉన్న పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలతోపాటు కొత్తగా మరో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. పాతబస్తీ వెలుపల మజ్లిస్ పోటీ.. తన మిత్రపక్షం మేలుకే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి? నిజంగా మజ్లిస్ పోటీ బీఆర్‌ఎస్‌కు లాభిస్తుందా?

పాతబస్తీ పార్టీ ఎంఐఎం అసెంబ్లీ సమర శంఖం పూరించింది. హైదరాబాద్ నగరంలోని 9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఇద్దరిని తప్పించిన అసదుద్దీన్.. కొత్తగా ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఐతే రాష్ట్రంలో 50 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన మజ్లిస్.. తాజాగా ఆ ఊసెత్తకపోగా.. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతోపాటు కొత్తగా రెండు సీట్లలో పోటీ చేస్తామన్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

బహుదూర్‌పురా అభ్యర్థిని ప్రకటించని ఎంఐఎం
పాతబస్తీలో చాంద్రాయణగుట్ట, చార్మినార్, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట్, యాకుత్‌పురా, బహుదూర్‌పురా నియోజకవర్గాల్లో మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో బహుదూర్‌పురా నియోజకవర్గానికి ఇంకా ఎవరినీ అభ్యర్థిని ప్రకటించకపోగా, చార్మినార్, యాకుత్‌పురా ఎమ్మెల్యేలు ముంతాజ్‌ఖాన్, పాషాఖాద్రిలకు టికెట్లు నిరాకరించారు. వీరిద్దరి స్థానంలో చార్మినార్ నుంచి జుల్ఫికర్ అలీ, యాకుత్‌పురా నుంచి జాఫర్ హుస్సేన్‌లకు అవకాశం ఇచ్చారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట నుంచి అహ్మద్ బలాలా, కార్వాన్ నుంచి కౌసర్ మొహిద్దీన్, నాంపల్లి నుంచి మాజిద్ హుస్సేన్‌ పేర్లు ప్రకటించారు. ఇక పాతబస్తీ వెలుపల ఉన్న జుబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల నుంచి పోటీ చేస్తామని ప్రకటించిన అసదుద్దీన్… ఆ నియోజకవర్గాల్లో ఎవరు పోటీచేసేది ప్రకటించలేదు.

జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల నుంచి పోటీ
ప్రధానంగా మైనార్టీ ఓట్లపై ఆధారపడే మజ్లిస్ పార్టీ.. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న ప్రకటన రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి 2014లో పోటీచేసిన ఎంఐఎం అభ్యర్థి 40 వేల ఓట్లు సాధించి ద్వితీయస్థానంలో నిలిచారు. 2018లో మిత్రపక్షం బీఆర్‌ఎస్‌తో అవగాహనతో పోటీ చేయలేదు. ఐతే మైనార్టీ ఓట్లు భారీగా కారుపార్టీకి బదిలీ అవడంతో సునాయాసంగా గెలుపొందింది గులాబీ పార్టీ.. ఐతే ఈ సారి అక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిగా మైనార్టీ నేత, మాజీ క్రికెటర్ అజరుద్దీన్‌ను టికెట్ ఖరారు చేయడంతో మైనార్టీ ఓట్ల లెక్కల్లో తేడా వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేస్తానని ఎంఐఎం అధినేత ప్రకటించడం తన మిత్రపక్షం బీఆర్‌ఎస్‌ను రక్షించేందుకే అన్న వాదన వినిపిస్తోంది.

Also Read: మొన్న టీడీపీ, నిన్న టీజేఎస్.. నేడు వైఎస్‌ఆర్‌టీపీ.. ఎందుకిలా?

రాజేంద్రనగర్‌లో గణనీయంగా మైనార్టీ ఓట్లు
ఇక ఎంఐఎం పోటీ చేస్తానని ప్రకటించిన మరో నియోజకవర్గం రాజేంద్రనగర్.. ఇక్కడ కూడా ప్రస్తుతం త్రిముఖ పోటీ జరిగే అవకాశం^ఉంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ మైనార్టీ ఓట్లు భారీగానే ఉన్నాయి. అక్కడ ఎంఐఎం పోటీ చేయకపోతే ఆ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ జరిగి.. బీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి బలమైన నేతగా చెబుతున్నారు. హిందుత్వ నినాదంతో అక్కడ బీజేపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో మైనార్టీ ఓట్ల చీలిక బాధ్యత ఎంఐఎం తీసుకున్నట్లు చెబుతున్నారు పరిశీలకులు.

Also Read: కొలిక్కివచ్చిన చర్చలు.. కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు

ఈ విధంగా అటు జూబ్లీహిల్స్‌లోనూ.. ఇటు రాజేంద్రనగర్‌లోనూ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లకుండా అడ్డుకునే ప్లాన్‌లోనే మజ్లిస్ బరిలోకి దిగుతోందని ప్రచారం జరుగుతోంది. మజ్లిస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మైనార్టీ నేత అజారుద్దీన్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు. మొత్తానికి తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న మజ్లిస్ ప్రకటనలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో హాట్ డిబేట్‌కు వేదికవుతున్నాయి.