YS Sharmila: మొన్న టీడీపీ, నిన్న టీజేఎస్.. నేడు వైఎస్‌ఆర్‌టీపీ.. ఎందుకిలా?

మొన్న టీడీపీ.. నిన్న టీజేఎస్.. ఈ రోజు వైఎస్‌ఆర్‌టీపీ.. ఇలా రోజుకో పార్టీ ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవడంతో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ మూడు పార్టీల మహా సంగ్రామంగా మారుతోంది.

YS Sharmila: మొన్న టీడీపీ, నిన్న టీజేఎస్.. నేడు వైఎస్‌ఆర్‌టీపీ.. ఎందుకిలా?

why ys sharmila takes u turn in telangana polls

Updated On : November 4, 2023 / 10:36 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణ దంగల్ నుంచి మరో పార్టీ ఔట్ అయింది. అరకొర బలంతో రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించలేనని డిసైడ్ అయిన వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల.. నామినేషన్ల తొలిరోజే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేనని తేల్చేశారు. మొన్న టీడీపీ.. నిన్న టీజేఎస్.. ఈ రోజు వైఎస్‌ఆర్‌టీపీ.. ఇలా రోజుకో పార్టీ ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవడంతో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ మూడు పార్టీల మహా సంగ్రామంగా మారుతోంది.

తెలంగాణ సంగ్రామంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని.. రాజన్న రాజ్యం తెస్తానని.. నెక్ట్స్‌ సీఎం తానేనంటూ మూడు వేల 8 వందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిల.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. రెండున్నరేళ్ల క్రితం సొంత పార్టీ పెట్టడమే కాకుండా.. సీఎం కేసీఆర్‌ను ఓడించే బలం తనకే ఉందని గొప్పలు చెప్పుకున్న షర్మిలకు అంతగా జనాదరణ లేదని ఆలస్యంగా గ్రహించారు.

సుదీర్ఘ పాదయాత్ర చేసినా చెప్పుకోదగ్గ మైలేజ్ రాకపోవడంతో కాంగ్రెస్‌తో చేతులు కలపాలని ప్రయత్నించారు. ఐతే ఆంధ్రా ప్రాంత నాయకురాలిగా షర్మిలను చూసిన టీకాంగ్రెస్ నేతలు.. ఆమెను ఏపీ రాజకీయాలు చూసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడమే కాకుండా.. తెలంగాణ పాలిటిక్స్‌కు దూరం పెట్టాలని అధిష్టానాన్ని కోరారు. టీ కాంగ్రెస్ నేతల వైఖరితో తనకు అవమానం జరిగిందని.. హస్తం పార్టీకి చుక్కలు చూపిస్తానని ప్రకటించారు షర్మిల. రాష్ట్రంలోని 119 సీట్లలోనూ పోటీ చేస్తానని చెప్పిన షర్మిల.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చివరికి నామినేషన్లు వేయాల్సిన సమయంలో పోరు నుంచి నిష్క్రమించారు.

ఎన్నికల నుంచి తప్పుకోవడమే కాకుండా.. ఓట్లు చీలిపోతాయనే కారణంతో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు షర్మిల చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అసలు షర్మిల రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు? ఈ రెండున్నరేళ్లలో ఏం సాధించారు? ఇప్పుడు ఎందుకు పోటీ నుంచి తప్పుకోవాలని భావించారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పాటి దానికి ఆమె సొంతంగా పార్టీ పెట్టడం ఎందుకని.. నిలదీస్తున్నారు కార్యకర్తలు.. షర్మిల తండ్రి రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో.. స్థానిక రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసిన ఎంతోమంది షర్మిల పార్టీ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. రెండున్నరేళ్లుగా ఎన్నో కష్టనష్టాలు ఓర్చి పనిచేశారు. తన వెంట నడిచిన క్యాడర్‌కు ఒక్కమాట కూడా చెప్పకుండా ఎన్నికల నుంచి వైదొలగాలని ఏకపక్షంగా ప్రకటించారు షర్మిల. తాను పోటీ చేయకపోవడానికి ఆమె చెబుతున్న కారణాలు రుచించక.. ఆమె నివాసం లోటస్‌పాండ్ ముందు ఆందోళనకు దిగారు కార్యకర్తలు.

Also Read: నా హత్యకు కుట్ర పన్నారు..? కోమటరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

మొత్తానికి తెలంగాణ సీఎం అవుతానని కలలు గన్న షర్మిల కలలు కల్లలు అవుతాయనే భయంతో ముందుగానే మేల్కొని.. గౌరవంగా తప్పుకున్నారంటున్నారు పరిశీలకులు. షర్మిల నిర్ణయం ఇప్పుడు ఏ పార్టీపై ప్రభావం చూపుతుందనే చర్చకు తెరలేపింది. వాస్తవానికి షర్మిల చీల్చే ఓట్లపై ఆశలు పెట్టుకున్న అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎన్నో పార్టీలు ప్రయత్నించాయి. గత ఎన్నికల్లో మహాకూటమి కట్టిన ప్రతిపక్ష పార్టీల్లోని కీలక పార్టీలు తెలుగుదేశం, తెలంగాణ జనసమితి కూడా ఈ ఎన్నికల నుంచి తప్పుకోవాలని ప్రకటించడం.. తాజాగా షర్మిల కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామంతో ట్రయాంగిల్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు.. నిలబడితే గెలవాలి : సీఎం కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి వేర్వేరు కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నాయి. ఏపీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం ముందుగా పోటీకి దూరమంటూ ప్రకటించగా, సీఎం కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యంతో తెలంగాణ సమితి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఇప్పుడు షర్మిల కూడా అదే వైఖరి తీసుకోవడంతో అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే పోటీ జరగనుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిల మధ్యలో వచ్చి మధ్యలోనే తన పొలిటికల్ ప్రయాణాన్ని ముగించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. తెలుగుదేశం, టీజేఎస్ చెప్పిన కారణాలు కన్నా… షర్మిల పోటీకి దూరంగా జరగేందుకు తీసుకున్న నిర్ణయం మాత్రం విమర్శలకు దారితీసింది. ఆ పాటి దానికి రాజకీయాల్లోకి రావడం ఎందుకంటూ నిరసనలు వినిపిస్తున్నాయి.