తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన సీఎస్ శాంతి కుమారి పదవీ విరమణ చేయనున్నారు.
రామకృష్ణారావు 1991 ఐఏఎస్ బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళిక విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన 10 బడ్జెట్లకు సంబంధించిన వ్యవహారాలను ఆయనే చూసుకున్నారు. తెలంగాణలోని ప్రధాన పథకాల అమలు కోసం అవసరమైన వనరులను సమీకరించారు.
రాష్ట్రంలో వివిధ ఫైనాన్షియల్ సిస్టమ్‌లను కె.రామకృష్ణారావు ప్రవేశపెట్టారు. ఆయన అదనంగా తెలంగాణ కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు. ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు.
డీజీగా ఆయన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నో సంస్కరణలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో పదవుల్లోనూ కొనసాగారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్, గుంటూరు కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గానూ పనిచేశారు. ఆయన కాన్పూర్, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలను పొందారు, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంబీఏ కూడా చేశారు.