×
Ad

Petal Gahlot : పీతల్ గెహ్లోత్.. ఐరాసలో 193 దేశాల సాక్షిగా పాక్ ప్రధానిని చీల్చి చెండాడిన భారత ధీర వనిత..

Petal Gahlot : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ప్రసంగంపై భారత దౌత్యవేత్త పీతల్ గెహ్లోత్ గట్టి బదులిచ్చారు.

Petal Gahlot

Petal Gahlot : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ప్రసంగంపై భారత దౌత్యవేత్త పీతల్ గెహ్లోత్ గట్టి బదులిచ్చారు. అసంబద్ధ నాటకాలతో వాస్తవాలను ఏమార్చలేరంటూ పాక్ ప్రధానిని కడిగిపారేశారు.

కాశ్మీర్, సింధూజలాల ఒప్పందం నిలిపివేసిన అంశాలపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు పీతల్ గెహ్లోత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ వేదికలపై అబద్దాలను చెబుతోందంటూ ఆమె ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎగుమతి చేయడంలో ఆదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాద శిబిరాలను నడపడం వంటి పాకిస్థాన్ ద్వంద వైఖరిని ఎత్తిచూపిన ఆమె.. ఈ ద్వంద వైఖరి ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని స్థాయికి చేరిందని అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన ఉగ్రవాద సంస్థ ది రేసిస్టెన్స్ ఫ్రంట్ ను పాకిస్థాన్ పెంచిపోషిస్తుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ప్రధాని వైఖరిని తూర్పారపట్టిన యువ దౌత్యవేత్త గెహ్లోత్ ఎవరు..? ఆమె నేపథ్యం ఏమిటి అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

పీతల్ గెహ్లోత్ ఎవరు?

పీతల్ గెహ్లోత్ మహారాష్ట్రకు చెందిన రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు. ఆమె ముంబయిలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తరువాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ విమెన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన గెహ్లోత్.. ఐఎఫ్ఎస్ లో 2015లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్ ను మొదలు పెట్టారు. ఈ క్రమంలో గత పదేళ్లలో ఆమె వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

గెహ్లోత్ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో భారత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అక్కడ ఆమె ప్రపంచ శాంతి, భద్రత, సహకారంపై చర్చలో భారత్ తరపున తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. గతంలో పలుమార్లు ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ దేశం భారతదేశంపై చేసిన ఆరోపణలకు గెహ్లోత్ బలంగా తిప్పికొట్టారు.

ఇంతకుముందు గెహ్లోత్ కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్‌లో అండర్ సెక్రటరీగా కూడా సేవలందించారు. పారిస్, శాన్ ఫ్రాన్సిస్కోల్లోని ఇండియన్ కాన్సులేట్స్‌లో కూడా పనిచేశారు.
గెహ్లోత్‌లో మరోకోణం ఉంది. ఆమెకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా గిటార్ వాయిస్తూ, పాటలు పాడుతూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆమె పాడిన ఇటాలియన్ సాంగ్ ‘బెల్లా సియావో’కు సోషల్ మీడియాతో అత్యంత ఆదరణ లభించింది.