కారు పార్టీకి మజ్లిస్‌ను దూరం చేయడమే రేవంత్‌రెడ్డి లక్ష్యమా?

నిజానికి గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్‌రెడ్డికి, ఓవైసీ సోదరులకు మధ్య ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది.

why revanth reddy plan to tieup with asaduddin owaisi AIMIM party

సీఎం రేవంత్‌రెడ్డి మజ్లిస్‌కు స్నేహహస్తం చాపుతున్నారా..? మజ్లిస్ విషయంలో రేవంత్ ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తున్నారా? కారు పార్టీకి మజ్లిస్‌ను దూరం చేయడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యమా? MIMకు సిగ్నల్ వెనక అసలు సీఎం వ్యూహమేంటి..? సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి.. మజ్లిస్‌తో వ్యహరిస్తున్న తీరు చూసిన వారికి కలుగుతున్న సందేహాలివి.

తెలంగాణ ఏర్పడిన దగ్గరి నుంచి బీఆర్‌ఎస్‌కు, MIMకు మధ్య స్నేహభావం ఉంది. ఈ ఎన్నికల ముందు కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ కొత్త లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్‌కు MIMను దూరం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అదే సమయంలో అభివృద్ధి అజెండాగా కొత్త స్నేహానికి చిగురులు తొడుగుతున్నారు.

జెట్ స్పీడ్ లో రేవంత్‌రెడ్డి
సీఎం అయిన దగ్గరినుంచి రేవంత్‌రెడ్డి జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజావాణి మొదలు ఆరుగ్యారెంటీలవరకు తనదైన ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయంలో త‌న టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్న రేవంత్.. ప్రత్యర్థి పార్టీలపై సైతం త‌న‌దైన శైలిలో రాజ‌కీయాన్ని ప్రారంభించారు.

పాతబస్తీ అభివృద్ధిపై రేవంత్ ప్రత్యేక దృష్టిపెట్టారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పరేషన్‌పై రెండురోజుల క్రితం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షకు అక్బరుద్దీన్ హాజరయిన దగ్గరనుంచి కాంగ్రెస్, మజ్లిస్ స్నేహంపై రాజకీయ ఊహాగానాలు బయలుదేరాయి. మూసీకారిడార్‌తో పాతబస్తీకి దగ్గరయ్యేందుకు రేవంత్ వ్యూహం రచించారు. ఐపీఎస్ షానవాజ్‌కాసీంను CMOలోకి తీసుకోవడం ద్వారా మైనార్టీలకు పెద్దపీట వేశామన్న సందేశం మజ్లిస్‌కు పంపారు.

మజ్లిస్‌ను దగ్గర చేసుకునేందుకు ప్లాన్ బి
నిజానికి గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్‌రెడ్డికి, ఓవైసీ సోదరులకు మధ్య ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది. గోషామ‌హ‌ల్ పోటీకి MIM దూరంగా ఉండడంపై రేవంత్ పలు విమర్శలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు దూరంగా ఉన్న మజ్లిస్‌ను దగ్గర చేసుకునేందుకు ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పాతబస్తీ అభివృద్ధి డిమాండ్ నెరవేరిస్తే..
హైదరాబాద్ అభివృద్ధి ఆయుధాన్ని మజ్లిస్‌పై ప్రయోగిస్తున్నందునే.. సమీక్షకు అక్బరుద్దీన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారని భావిస్తున్నారు. పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్, మూసీ కారిడార్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ కారిడార్‌గా మార్చాలనుకోవడం వంటివి ఇందులో భాగమేనని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పాతబస్తీ అభివృద్ధి డిమాండ్ నెరవేరిస్తే.. కాంగ్రెస్‌కు MIMకు మధ్య ఉన్న వైరం తొలగుతుందని భావిస్తున్నారు. పాతబస్తీ అభివృద్ధి మంత్రం వల్ల మజ్లిస్‌కు సైతం కాంగ్రెస్‌తో కలిసి నడించేందుకు బలమైన అంశం దొరుకుతుంది.

రేవంత్‌కు ప‌క్కా ఫ్యూహం
మజ్లిస్‌తో దోస్తీకి గ్రీన్ సిగ్నల్ వెన‌క రేవంత్‌కు ప‌క్కా ఫ్యూహం ఉంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. బీఆర్‌ఎస్‌కు 39, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్తులో ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయితే.. MIM మద్దతు అవసరమవుతుందని.. అందుకే రేవంత్ ఇప్పటినుంచే ఆ పార్టీని లైన్‌లో పెడుతున్నారని భావిస్తున్నారు. అలాగే జాతీయస్థాయిలో మజ్లిస్‌ను ఇండియా కూటమికి దగ్గర చేయడం కూడా రేవంత్ వ్యూహంలో భాగమన్న వాదన వినిపిస్తోంది.