సమ్మక్క దేవరగుట్టలోనే ఎందుకు ఉన్నట్టు? జలకం బావి మహత్తు ఏంటి?

  • Publish Date - February 3, 2020 / 01:47 PM IST

సమ్మక్క జన్మించింది బయ్యక్కపేటేనని అప్పటి చర్రిత చెబుతోంది. కానీ పుట్టిన ఊరు బయ్యక్కపేటను ఎందుకు వద్దనుకుంది..? దేవరగుట్టలోనే ఉంటానని సమ్మక్క మంకుపట్టు పట్టడం వెనుక కారణమేంటి..? జలకం బావికి ఉన్న మహత్తు ఏమిటి..? ఇలాంటివెన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది టెన్‌టీవీ బృందం. ఇక సమ్మక్క నివాసానికి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సమ్మక్క మొండిపట్టుతో :
చిన్నతనంలో బయ్యక్కపేట పరిసర ప్రాంతాల పరిస్థితి, వాతావరణం నచ్చకపోవడంతో పక్కనే ఉన్న గుట్టలో వదిలేయాలని కుటుంబసభ్యులను కోరింది సమ్మక్క. మొదట తమాషాగా తీసుకున్నారంతా. కానీ సమ్మక్క మొండి పట్టుదలతో గ్రామ పొలిమేరల్లో ఉన్న గుట్టపై వదిలిపెట్టారు. తనకు నీటి సదుపాయం కావాలని  కోరడంతో.. గుట్ట దగ్గర ఓ మంచినీటి బావిని తవ్వించారు.

దానినే జలకం బావి అని పిలిచేవారు. ప్రతిరోజూ సమ్మక్క అక్కడికి వెళ్లి స్నానం చేసేదని గిరిజనులు చెబుతున్నారు. బావి శిథిలావస్థకు  చేరుకుని చిన్న గుంటలా మారిపోయింది. ఇక సమ్మక్క పెరిగిన గుట్టను దేవరగుట్టగా పిలవడం మొదలెట్టారు. అడవిలో సమ్మక్క క్రూర మృగాలతో ఆటలాడేదట. ఇదే విషయాన్ని స్థానికులు చాలా  ఆసక్తిగా చెబుతుంటారు. 

జాతర సమయంలోనే జలకం బావి దగ్గరకు..
ముఖ్యంగా జలకం బావిని గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే జలకం బావి వైపు.. కేవలం జాతర సమయంలో మాత్రమే వెళ్తారు. అది కూడా చాలా దూరంలో  చెప్పులు వదిలేసి… కాలి నడకతో బావి దగ్గరకు వెళ్తారు. స్థానికుల సహాయంతో టెన్‌టీవీ అతి కష్టం మీద జలకం బావి దగ్గరకు వెళ్లింది. జాతర సమయంలో పూజారులు, భక్తులు పూనకంతో ఊగిపోతుంటారని..  వారిని శాంతింప చేసేందుకు ఈ నీటిని చల్లుతారట. అది కూడా కేవలం అనపకాయ బుర్రలో మాత్రమే నీటిని తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు గిరిజనులు.

ట్రెండింగ్ వార్తలు