Telangana Congress: అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ తర్జనభర్జన.. టికెట్ల ప్రకటన ఎప్పుడు?

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకునేలా వ్యూహకర్త సునీలు కనుగోలు సర్వే రిపోర్టులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.

why telangana congress assembly contested candidates list late?

Telangana Congress Party: కాంగ్రెస్ టికెట్ల ప్రకటన ఎప్పుడు..? హస్తం పార్టీ పెద్దలు చెప్పినట్లైతే ఇప్పటికే తొలి విడత జాబితా ప్రకటించి వారం గడిచిపోయేది! కానీ, ఇప్పటికీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే దాఖలాలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించడం లేదు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ అన్నారు.. అక్టోబర్ ఫస్ట్ వీక్ అన్నారు. ఈ రెండు గడువులు పూర్తవడంతో ఇప్పుడు సెకెండ్ వీక్ అంటున్నారు.. కాంగ్రెస్ తాజా పరిస్థితులు గమనిస్తుంటే రెండో వారంలోనూ విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనే తర్జనభర్జన పడటానికి కారణమేంటి? హస్తానికి అంతుచిక్కిన సమస్య ఏమైనా ఉందా? తెరవెనుక రాజకీయమేంటి?

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టికెట్ల ప్రకటన ఆలస్యం అవుతుండటంతో పార్టీ క్యాడర్లో టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కాని కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కిరాలేదు. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వడపోత కార్యక్రమం పూర్తిచేసింది కాంగ్రెస్.. కాని తుది జాబితా ప్రకటనపై విపరీతమైన జాప్యం చేస్తోంది.. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తామంటున్న కాంగ్రెస్.. ఇప్పటికే ఓ సంస్థ ద్వారా సర్వే చేయించింది. ఆ తర్వాత కూడా రకరకాల సర్వేలు చేయిస్తుండటమే కాలయాపనకు కారణమవుతోందని తెలుస్తోంది.

సర్వేల మీద సర్వేలు
ఇలా సర్వేల మీద సర్వేలు చేయడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండటం వల్ల కొత్త నాయకులు వస్తున్న కొద్దీ కొత్త సర్వేలు చేయిస్తుండటంతో లెక్కలన్నీ మారిపోతున్నట్లు చెబుతున్నారు. ఏ సర్వేను ప్రాతిపదికగా తీసుకోవాలో కూడా తేల్చుకోలేకపోవడం కూడా అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. పార్టీలో కొత్తగా వచ్చి చేరిన నేతలు దాదాపు 45 చోట్ల టికెట్లు దక్కించుకునే పరిస్థితి ఉండటం.. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గం నాగర్ కర్నూల్ పరిధిలో రెండు రిజర్వు స్థానాలకు మాత్రమే పాత నేతలకు టికెట్లు దక్కే అవకాశం ఉంది. మిగతా ఐదు చోట్ల ఈ మధ్యే పార్టీలో చేరిన నేతలకే టికెట్లు ఇవ్వాల్సిన అనివార్యత కన్పిస్తోంది.

ఇంకా ఎవరైనా కొత్త నేతలు వస్తారా?
అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి తాండూరు టికెట్ ఆశిస్తూ 6వ తేదీ శుక్రవారమే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అటు హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ బల్మూరి వెంకట్ బదులు బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బంధువు ప్రణవ్ బాబుకు టిక్కెట్ ఇచ్చేందుకు డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహుడైన మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ బాబు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు సహా బంధుగణం అంతా బీఆర్ఎస్ లో కీరోల్ పోషిస్తుంటే.. ప్రణవ్ మాత్రం చేతిలో చేయ్యేసి సాగేందుకు కాంగ్రెస్ లో చేరిపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే టికెట్లు ప్రకటించి ఉంటే.. ఇలాంటి చోట్ల ఇబ్బందులు తలెత్తేవి. దీంతో ఇంకా ఎవరైనా కొత్త నేతలు వస్తారా? అన్న కోణంలోనూ ఆలస్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా?

ఎటూ తేల్చుకోలేకపోతున్న అధిష్టానం
ఇదే సమయంలో బీసీ నేతల పేచీ కూడా అభ్యర్థుల వడబోతకు ఆటంకంగా మారిందంటున్నారు. పార్టీలో బీసీలకు సముచిత స్థానం కోసం ఆ వర్గం నేతలు పట్టుబడుతున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ – PAC నిర్ణయించిన 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కూడా పార్టీలో విస్తృత చర్చ జరుగుతుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది అధిష్టానం. ముఖ్యంగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలపైనా అనేక ఫిర్యాదులు కూడా జాబితా జాప్యానికి కారణంగా మారుతున్నాయి.

Also Read: ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టడంతో.. టెన్షన్ పడుతున్న ఎంపీ దయాకర్‌!

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకునేలా వ్యూహకర్త సునీలు కనుగోలు సర్వే రిపోర్టులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. థర్త్ పార్టీతో సర్వేలు చేయించి టిక్కెట్టివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగా దాదాపు 25, 30 నియోజకవర్గాల్లో రీ సర్వే చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే రిపోర్ట్ వచ్చాకే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని చెప్తున్నారు కాంగ్రెస్లో ఓ వర్గం నేతలు. మొత్తం పరిస్థితులను పరిశీలిస్తున్న కొందరు సీనియర్ నేతలు.. ఈ సారి కూడా పాత సంప్రదాయం ప్రకారం నామినేష్లు వేసేవరకు టికెట్ల పంచాయితీ తేలేది లేదంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు