Corona Patient
Corona Patient: కరోనా రోగుల పట్ల కొందరు వ్యక్తులు వివక్షత చూపుతున్నారు. ఇంట్లో వారికి కరోనా వస్తే జాగ్రత్తగా చూసుకోకుండా దూరం పెడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కరోనా సోకిన భార్యను భర్త బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లోని మరుగుదొడ్డిని కూడా వాడకూడదని కండిషన్ పెట్టాడు. లక్సెట్టిపేట గోదావరి రోడ్, గోపాలవాడలో భార్య భర్తలు మేడి నర్సమ్మ, పెద్దయ్య నివాసం ఉంటున్నారు.
నర్సమ్మకు ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లో సరిపడా గదులు ఉన్నా.. పెద్దయ్య ఆమెను బాత్ రూమ్ లో ఉంచాడు. బయట ఓ గొయ్యి తీసి అక్కడే కాలకృత్యాలు తీర్చుకోవాలని తెలిపాడు. అయితే ఆ గోతి నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దయ్య ఇంటికి వచ్చిన పోలీసులు నర్సమ్మను ఐసోలేషన్ సెంటర్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే నర్సమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఇక్కడే ఉంటానని మొండికేసి కూర్చుంది. దీంతో పోలీసులు పెద్దయ్యను ఒప్పించి ఇంట్లో ఓ గదిని కేటాయించారు.