ఎన్నిక ఏదైనా.. రాష్ట్రంలో ఏ మూలన ఏ పోస్ట్‌కు ఎలక్షన్స్ జరిగినా..ఒకప్పుడు గులాబీ పార్టీ హవానే వేరు. బీఆర్ఎస్ పార్టీకి పోటీగా అభ్యర్థిని బరిలోకి దింపాలంటేనే ఆలోచించే పరిస్థితి. సీన్ కట్ చేస్తే ఇప్పుడదే పార్టీ..పోటీ చేయాలా వద్దా అని డైలమాలో ఉందట. కంచుకోటగా ఉన్న ఆ నాలుగు జిల్లాల్లో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయొద్దని భావిస్తోందట. ఆశావహులు ఉన్నా..టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నా.. అధిష్టానం మాత్రం రుకో జర సబర్ కరో అంటోందట.
మార్చిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సీటులో సీనియర్ నేత జీవన్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఈ సీటును రెండుసార్లు గెలుచుకుంది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు పోటీ చేయాలంటేనే ఆలోచిస్తోంది.
అపోజిషన్‌లోకి వచ్చేసరికి డీలా
తెలంగాణ ఉద్యమ సమయంలో కోరి మరీ ఎన్నికలను తెచ్చుకున్న గులాబీ పార్టీ అపోజిషన్‌లోకి వచ్చేసరికి డీలా పడిపోయింది. అంతేకాదు వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్‌లో ఓటమి..లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంతో..కారు రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. పోటీ చేసి ఓడిపోతే..పార్టీ వీక్ అయిందన్న టాక్ పోతుంది..అందుకే పోటీనే చేయకపోతే బెటరనే ఆలోచన చేస్తున్నారట గులాబీ బాస్.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ మండలి సభ్యుల ఎన్నికలు, కరీంనగర్ స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలు వచ్చేనెల మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది. శాసనమండలి ఎన్నికలు కావడంతో సిట్టింగ్ శాసన మండలి సభ్యుల పదవీకాలం పూర్తికాకముందే ఈ ఎన్నికలను ఎన్నికల సంఘం పూర్తి చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ మూడు సీట్లలో పోటీపై గులాబీ పార్టీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగానే ఉండాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంతోమంది ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా..పార్టీ పెద్దలు మాత్రం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడంతో నేతలు కూడా ఆశలు వదులుకుంటున్నట్లు తెలుస్తోంది.
సానుకూల ఫలితాలు దక్కే అవకాశం లేదా?
సాధారణ ఎన్నికలతో పోలిస్తే అతి తక్కువ మంది ఓటర్లు ఉండే ఈ ఎన్నికల్లో పోటీ చేసినా సానుకూల ఫలితాలు దక్కే అవకాశం లేదని గులాబీ పార్టీ అంచనా వేస్తుందట. ఈ స్థానాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం లేకపోయినా..ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసినా విజయం దక్కించుకోలేమన్న అభిప్రాయంతో గులాబీ దళపతి ఉన్నట్లు టాక్. అందుకే పోటీకి దూరంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.
కొంతమంది ఆశావాహులు పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నా..పార్టీ నిర్ణయం తీసుకోకపోవడంతో డిఫెన్స్‌లో పడ్డట్టు తెలుస్తుంది. పార్టీ అధికారికంగా అభ్యర్థిని అనౌన్స్ చేసి సహకరిస్తేనే పోటీకి తాము సిద్ధమన్న అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం ఇలా ఉంటే..స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించకపోవచ్చని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఈ కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండాలన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి గులాబీ పార్టీ అధిష్టానం ఆలోచన మారుతుందా..లేక పోటీకే దూరంగానే ఉంటారా అన్నది వేచి చూడాలి.
AP Politics: నెల్లూరు పాలిటిక్స్‌లో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి