Site icon 10TV Telugu

రేవంత్‌ వ్యూహం ఫలిస్తుందా? కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారా..? ఎలాగైనా కేసీఆర్‌ను బయటికి రప్పించేందుకు కాంగ్రెస్ స్కెచ్

KCR

ఏడాదికిపైగా విచారణ. ఎన్నో లీకులు..మరెన్నో ఊహాగానాల మధ్య..ఎట్టకేలకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నాలుగురోజుల్లోనే క్యాబినెట్ సమావేశం పెట్టి డిస్కస్ చేసింది సర్కార్. ఆ తర్వాత కాళేశ్వరంలోని మేడిగడ్డ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపణలు..రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతామని సీఎం రేవంత్ ప్రకటన..త్వరలో శాసనసభ సమావేశాలు..ఇలా అన్ని చకచకా జరిగిపోతున్నాయి.

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే కాళేశ్వరం విచారణ మొత్తం మాజీ సీఎం కేసీఆర్ చుట్టూనే తిరిగింది. కమిషన్ రిపోర్టు కూడా కేసీఆర్‌ను వేలేత్తి చూపేలా ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడుతామని ప్రభుత్వం చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉందట. సభలో రిపోర్ట్‌ను ఇంటర్‌ డ్యూస్ చేస్తే..కేసీఆర్‌ సభకు రాక తప్పదనే అంచనాలు వేస్తోందట రేవంత్ సర్కార్. ఎందుకంటే కాళేశ్వరం ఇట్‌ అండ్ ఔట్..ఓ రకంగా ఆ ప్రాజెక్ట్ సృష్టికర్త కేసీఆర్. ఈ మాట ఆయనే పలు సార్లు చెప్పుకున్నారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా మల్చుకుని కేసీఆర్ సభకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Also Read: రీ ఎంట్రీ ఇస్తా.. పెద్దల సభకు వెళ్తానంటున్న గల్లా జయదేవ్!

ఏడాదిన్నర కాలంగా కేసీఆర్‌ పెద్దగా బయటకు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాల తో పాటు ఇతరత్ర వేదికలపై నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సవాళ్లు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్‌ వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలంటూ కోరారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులను గులాబీ బాస్ లైట్ తీసుకుంటున్నారు. అయితే ఈ సారి ఎలాగైనా సరే బయటకు రప్పించాలని చూస్తున్నారట సీఎం రేవంత్. నిన్ను బయటికి రప్పిస్తా..అవినీతిని కక్కిస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఇంప్లిమెంట్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట.

ఇంత సీరియస్‌గా ఉండడానికి ఒక రీజన్ ఉందట
గులాబీ దళపతి విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇంత సీరియస్‌గా ఉండడానికి ఒక రీజన్ ఉందని చెబుతున్నారు. కేసీఆర్ ఇప్పటివరకు పెద్దగా బయటకు రాకపోవడంతో..ఆయన మౌనం వెనుక పెద్ద మర్మమే ఉంటుందన్న టాక్ ప్రజల్లో ఉంది. కేసీఆర్‌ ఇప్పుడు బయటికి రారు..రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించరని ప్రజలే డిసైడ్ అయిన పరిస్థితి. పైగా రేవంత్‌ది కేసీఆర్ స్ట్రేచర్‌ కాదని బీఆర్ఎస్ నేతలు పదేపదే చెబుతున్నారు. రేవంత్ స్థాయికి కేటీఆర్, హరీశ్‌ ఇద్దరు సరిపోతారని అంటున్నారు.

కేసీఆర్ సీఎంగా పని చేసిన నేత..పైగా ఉద్యమ నాయకుడిగా..ఆయనపై ప్రజల్లో సానుభూతి, అభిమానం, నమ్మకం ఇవన్నీ ఉండే ఉన్నాయి. దీంతో ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడినా అప్పుడు సెన్సేషన్ అవడం ఖాయం. ఆయన చుట్టే చర్చ జరిగి బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌కు మారే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పుడే కేసీఆర్‌ను బయటకు రప్పించి..తాము చేసే ఆరోపణలకు, విమర్శలకు కౌంటర్‌ ఇచ్చేలా చేస్తే..ప్రభుత్వం వర్సెస్ అపోజిషన్‌ అన్నట్లు అంతా మామూలుగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది.

లేకపోతే లాస్ట్ మూమెంట్‌లో కేసీఆర్ రంగంలోకి దిగితే..ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందని..అందుకే ఇప్పుడే కేసీఆర్‌ను ప్రజల్లోకి తెచ్చి..పబ్లిక్‌లో గులాబీ బాస్‌కు ఉన్న హైప్‌ను తగ్గించాలనేది సీఎం రేవంత్ స్కెచ్ అంటున్నారు. కేసీఆర్ ఇలాగే సైలెంట్‌గా ఉంటూ..సీఎం రేవంత్ రెడ్డిను లెక్కలోకి తీసుకోకుండా బిహేవ్ చేస్తే..తమకు పరువు తక్కువ అని అనుకుంటున్నారట హస్తం పార్టీ పెద్దలు. పైగా రేవంత్‌ స్థాయికి కేటీఆర్, హరీశ్‌ చాలనే టాక్‌ కూడా బలంగా నాటుకుపోతుందని..ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసేలా..కేసీఆర్‌ను సభకు రప్పించి..గత ప్రభుత్వ తప్పిదాలపై అటాక్ చేసి..ఆయన హైప్‌ను తగ్గించాలనేది రేవంత్ ప్లాన్ అంటున్నారు.

లేకపోతే ఇలాగే హైప్ కంటిన్యూ అయితే..వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ సెలెన్స్‌కు బ్రేక్ వేయకపోతే..బీఆర్ఎస్‌ వేవ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట. ఎలాగైనా కేసీఆర్‌ను సభకు రప్పించాలని చూస్తున్నారట సీఎం రేవంత్‌. కాంగ్రెస్ ఎత్తులకు బీఆర్ఎస్ పైఎత్తులు ఎలా ఉండబోతున్నాయి.? ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ ప్రవేశపెడితే కేసీఆర్ సభకు అటెండ్ అవుతారా లేదా.? కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్‌ ఇచ్చే సమాధానం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.

Exit mobile version