ఎల్‌ఆర్‌ఎస్‌ స్లాబ్‌రేట్‌ను ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఉంచుతారా?

LRS slabrate : అనధికార ప్లాట్లు, అక్రమ లే-అవుట్ల క్రమబద్దీకరణను ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చింది. ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుని కూడా నెలరోజులైంది. అయినా ఇంతవరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. అసలు ఎల్‌ఆర్‌ఎస్‌ స్లాబ్‌రేట్‌ను ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఉంచుతారా? లేక తీసివేస్తారా? దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌ఆర్ఎస్‌కు దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వెయ్యి రూపాయలు చెల్లించి మరీ వీరంతా అప్లై చేసుకున్నారు. కార్పొరేషన్ల పరిధిలో 4, 16,155 … మున్సిపాలిటీల్లో 10,60,013… గ్రామ పంచాయతీల్లో మరో 10,83,394మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 25, 59,562మంది తమ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ముందుకొచ్చారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింకపోతే.. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగవని చెప్పడంతో వీరంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ప్లాట్‌కు వెయ్యి రూపాయలు చెల్లించి మరీ అప్లై చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా దండిగా ఆదాయం వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా… అసలు చిక్కంతా ఇక్కడే వచ్చిపడింది.

ప్లాట్లు అమ్మాలన్నా, కొనాలన్నా….ఇల్లు కట్టుకోవాలన్నా ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో జనాలు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేశారు. అయితే.. ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాలన్న కారణంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. దీంతో ప్లాట్ల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ధరణిలో ప్రభుత్వం అనేక మార్పులు చేసినా….. ఇంకా జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే 29 పేజీలలో వివరాలు నింపాల్సి ఉంటుంది. భూములు అమ్మడం లేదా కొనాలనుకున్న వారికి ఇదో తలనొప్పిగా మారింది. అయితే లింక్‌ డాక్యుమెంట్స్‌ లేకుండానే రిజిస్ట్రేషన్‌ జరిగేలా కొత్త పద్దతి తీసుకొచ్చారు. దీంతో పలువురిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

లింక్‌ డాక్యుమెంట్‌ లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా ప్లాట్స్‌ ఎవరి పేరు మీది నుంచి ఎవరి పేరుకు రిజిస్ట్రేషన్‌ అవుతుందన్న వివరాలు తెలియడం లేదు. దీని ద్వారా దొంగ రిజిస్ట్రేషన్స్ చాలా మంది చేసుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం తీసుకొచ్చిన కొత్త పద్దతి లోపభూయిష్టంగా ఉందని రియల్టర్లు అంటున్నారు.

వారసత్వంగా వచ్చిన భూమికి కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు వసూలు చేస్తుండడంతో… కూలీనాలీ పనులు చేసుకునేవారు ఉన్నభూమిని అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అందుకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఎత్తివేయాలన్న డిమాండ్‌ కూడా తెరపైకి వస్తోంది. ప్లాట్లకు లక్షల రూపాయల ఫీజులు చెల్లించే పరిస్థితి అందరికీ ఉండబోదని… అందుకే ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎత్తివేస్తుందా….లేదా… ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.