Woman Catches Hold Of Chain Snatcher
Chain Snatchers : గొలుసు దొంగలు దొంగతనం చేసి పారిపోదామనుకున్నారు. కానీ, ఒంటిచేత్తో గొలుసు దొంగల ఆట కట్టించిందో మహిళ. రామంతాపూర్ గాంధీనగర్ కు చెందిన రూపారాణి (50) అనే మహిళ. ఎప్పటిలానే గాంధీనగర్‌లోని ఇంటినుంచి కమాన్ వరకు వాకింగ్ చేస్తున్నారు. ఉదయం 7.30 సమయంలో చర్చికాలనీ కమాన్ నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా వెనుకనుంచి బైక్‌పై ఇద్దరు చైన్ స్నాచర్లు వచ్చారు.
ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించారు. మెడలోని గొలుసును లాగాడు. అప్రమత్తమైన రూపారాణి దొంగ చేతిని, చైన్‌ను గట్టిగా పట్టుకుంది. చేతిని విడిపించుకోవడానికి దొంగ ఎంత ప్రయత్నించినా వదల్లేదు. బైకుపై ఉన్న మరో దొంగ విడిపించే ప్రయత్నం చేసినా ఆమె పట్టువీడలేదు. దుండగులు రూపారాణిని రోడ్డుపైకి నెట్టారు. గట్టిగా కేకలు వేస్తూ పట్టు వదలకుండా ఉండిపోయింది.
అటుగా వస్తున్న ఆటోలోని వ్యక్తులు దగ్గరకు పరుగెత్తుకు రావటంతో ఒక దుండగుడు పారిపోయారు. రూపారాణి చేతికి చిక్కిన యువకుడిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. రూపారాణికి గాయాలయ్యాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.