Suspicious Death Of Doctor Swetha In Nizamabad
Suspicious Death of Doctor Swetha in Nizamabad : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత అనుమానాస్పదంగా మృతి చెందారు. ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. రాత్రి రెండుగంటల వరకూ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ శ్వేత ఆ తర్వాత తన గదికి వెళ్లి రెస్ట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ శ్వేత తెల్లవారుజామున చూసేప్పటికి ఆమె విగతజీవిగా కనిపించారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గైనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.గురువారం (మే12,2022) రెండు గంటల వరకూ ఆమె డ్యూటీలో ఉన్నారు. అనంతరం రెస్ట్ రూమ్ లో పడుకున్నారు. ఉదయం చూసేసరికి ఆమె మృతి చెందారు. గుండెపోటుతో డాక్టర్ శ్వేత చనిపోయినట్లుగా తెలుస్తోంది. లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తమతో పాటు కలిసి పనిచేసే తోటి డాక్టర్ హఠాత్తుగా చనిపోయే సరికి తోటి జూనియర్ డాక్టర్లు అంతా విషాదంలో నిండి ఉన్నారు. డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్ శ్వేత గుండెపోటుతో మృతి చెందటం పట్ల నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ మాట్లాడుతూ..డాక్టర్ శ్వేత చాలా చలాకీగా ఉండేవారని..ఆమెలో ఎప్పుడు డిప్రెషన్ వంటిది చూడలేదని ఆమె మరణం చాలా బాధాకరం అని అన్నారు. డాక్టర్ శ్వేత నైట్ ఫ్రెండ్స్ కు జ్యూస్ పార్టీ కూడా ఇచ్చిందని అంత యాక్టివ్ గా ఉన్న అమ్మాయి అలా చనిపోవటం చాలా బాధగా ఉందని అన్నారు.