Post Office: మహాలక్ష్మి పథకం కింద రూ.2వేల 500 ఇస్తున్నారంటూ ప్రచారం చేయడంతో ఆధార్ కార్డు పట్టుకుని పోస్టాఫీస్ దగ్గర బారులు తీరారు మహిళలు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి పోస్టాఫీస్ అధికారులను అడిగారు. షాక్ అయిన పోస్టాఫీస్ అధికారులు మహాలక్ష్మి స్కీమ్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. మీకు ఎవరు చెప్పారు అంటూ మహిళలను అడగ్గా.. ఒకరి నుంచి ఒకరికి సమాచారం వచ్చిందని, అందుకే వచ్చామని సమాధానం ఇచ్చారు.
రూ.2వేల 500 ఇస్తారంటూ పోస్టాఫీస్ ఎదుట పెద్ద సంఖ్యలో మహిళలు బారులుతీరిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. పరిగి టౌన్ లో ఉన్న పోస్టాఫీస్ కు మహిళలు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలను చూసి పోస్టాఫీస్ సిబ్బంది కంగుతిన్నారు. తమకు 2వేల 500 ఇవ్వాలంటూ మహిళలు పోస్టాఫీస్ సిబ్బంది నిలదీశారు. దీంతో వారు అవాక్కయ్యారు. ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పారు. అసలు మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. దీంతో మహిళలు నిరాశతో వెనుదిరిగారు.
కాగా, మహిళలకు నెలకు రూ.2వేల 500 పథకంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ స్కీమ్ కు సంబంధించి జనాలు గందరగోళానికి గురవుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి పలు రకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో మహిళలు పోస్టాఫీస్ కు క్యూ కడుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద 2వేల 500 నగదు జమ కావాలంటే పోస్టాఫీస్ ఖాతా ఉండాలని వదంతులు వ్యాపించడంతో భారీ సంఖ్యలో మహిళలు పోస్టాఫీస్ కు పోటెత్తారు. పోస్టాఫీస్ లో ఖాతాలు తెరిచేందుకు పోటీ పడుతున్నారు. అయితే, పోస్టాఫీస్ లో ఖాతా ఉంటేనే మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుందన్న ప్రచారంలో నిజం లేదని అధికారులు వెల్లడించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.