ఆకతాయి వేధింపులు…చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది

మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాగుతున్నాయి. నల్గొండలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పింది. సదరు యువకుడిని చెట్టుకి కట్టేసి చితకబాదారు భార్యాభర్తలు. షూస్ తో కొట్టి చివాట్లు పెట్టి పోలీసులకు అప్పగించారు.
 
నల్గొండ పట్టణంలో  శ్రీశైలం అనే యువకుడు చిల్లరమల్లరగా తిరుగుతూ ఆకతాయి చేష్టలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన ఓ వివాహితను వేధించడం మొదలు పెట్టాడు. వెకిలి చూపులతో అసభ్యకర సైగలతో వేధించేవాడు. గత నెలరోజులుగా వివాహిత ఇంటి పరిసరాల్లో సంచరిస్తూ ఇంట్లోకి తొంగి చూసేవాడు.

ఇదే విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. సీసీ కెమెరాల ద్వారా ఆకతాయి శ్రీశైలం సంచరిస్తున్నట్లు గుర్తించిన వివాహిత భర్త ఇంటిదగ్గరకు రాగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.