Yadagirigutta
Yadagirigutta Temple: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడిన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణం విమాన గోపురాన్ని స్వామివారికి అంకింతం చేయనున్నారు. స్వర్ణ విమానాన్ని దేవుడికి అంకితం చేసే ప్రక్రియలో దేశంలోని నదుల నుంచి సేకరించిన జలాలతో మహాసంప్రోక్షణ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఆవిష్కరణ పర్వాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నిర్వహిస్తారు. వానమామలై మఠం పీఠాధిపతి మధురకవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
స్వర్ణ విమాన గోపురం వంటి అత్యంత ఎత్తయిన గోపురం ఒక్క యాదగిరిగుట్టలో తప్ప మరెక్కడా లేదు. దేశంలోనే అత్యంత ఎత్తయిన మొట్టమొదటి స్వర్ణ విమాన గోపురంగా ఇది రికార్డుకెక్కడం గమనార్హం. స్వర్ణ విమాన గోపురం పనులు 2024లో ప్రారంభించారు. మహా సంప్రోక్షణకు 40 జీవనదుల జలాలు సేకరించారు. ఆదివారం ఆలయ సంప్రోక్షణ, మహాకుంభాభిషేకం ఘట్టం నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇస్తారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు.
స్వర్ణ విమాన గోపురం విశేషాలివే..
• స్వర్ణ విమాన గోపురం ఎత్తు: 50.5 అడుగులు
• స్వర్ణ విమాన గోపురానికి ఉపయోగించిన బంగారం మొత్తం : 68 కిలోలు
• బంగారు విమాన గోపురం వైశాల్యం: 10,759 చదరపు అడుగులు
• తాపడం పనులు ప్రారంభించిన తేదీ: 1 డిసెంబరు 2024
• తాపడం కవచాల బిగింపు పనుల పూర్తి: 18 ఫిబ్రవరి 2025
• బంగారు తాపడం బిగింపు ఖర్చు: రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా)
• రాగిరేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు
• పనిచేసిన కార్మికులు: 50 మంది
• పనులు చేసిన సంస్థ: నవయుగ మెటల్స్
• స్వర్ణ విమాన గోపురం పనులు చేసిన సంస్థ: ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్, చెన్నై