మే 4న నిశ్చితార్థం.. భయంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. పోలీసుల విచారణలో బయటపడ్డ అసలు విషయం..

బౌద్ధ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ మోహన్ కృష్ణ కు పెళ్లి కుదిరింది. మే 4న నిశ్చితార్ధం జరగాల్సి ఉంది.

Hyderabad: హత్యను కళ్లారా చూసిన తరువాత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో తాను ప్రత్యక్ష సాక్షిగా ఉండాల్సి వస్తుందేమోననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ వారాసిగూడ పీఎస్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

 

బౌద్ధ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ మోహన్ కృష్ణ కు పెళ్లి కుదిరింది. మే 4న నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. స్నేహితులు శ్యాంసన్ రాజు మరికొందరితో కలిసి ఈనెల 27న రాత్రి మోహన్ కృష్ణ మద్యం పార్టీ చేసుకున్నాడు. పార్టీలో ఉన్న శ్యాంసన్ రాజు.. అతని బావ లూథరస్ మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో శ్యాంసన్ రాజు తలపై ఇనుప రాడ్డుతో లూథరస్ కొట్టాడు. దీంతో స్పాట్ లో శ్యాంసన్ రాజు మృతిచెందాడు.

 

మిత్రుడి హత్యను ప్రత్యక్షంగా చూడటం, పెళ్లి జరగాల్సిన సమయంలో పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయంతో మోహన్ కృష్ణ  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత పోలీసులు పార్శిగుట్టలో జరిగిన శ్యాంసన్ రాజు హత్య కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో మోహన్ కృష్ణ ఆత్మహత్య కేసును కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే, పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఒకేరోజు జరిగిన రెండు ఘటనలకు లింక్ ఉందని గుర్తించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.