Youtuber Vaishnavi Husband : యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

Youtuber Vaishnavis Husband Brutally Murdered : యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ నగరంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

youtuber vaishnavi husband haribabu dies

Youtuber Vaishnavi Husband Haribabu : యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ నగరంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. రాజరాజేంద్ర చౌరస్తాలోని థియేటర్ సమీపంలో కూరగాయలు అమ్మే ప్రాంతానికి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు హరిబాబుపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. కొబ్బరికాయలుకోసే కత్తితో దాడి చేయడంతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. నిందితులు ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.

Also Read : Telangana Police jobs : ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల రాతపరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ప్రకటించిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ

నిజామాబాద్ టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ముగ్గురు వ్యక్తులు కారులో సంఘటనా స్థలానికి చేరుకొని హరిబాబుపై క్షణాల్లో దాడిచేసి అదే కారులో పరారైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. యూట్యూబర్ వైష్ణవి కేసుకు.. హరిబాబు హత్యకు సంబంధం ఉందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

కొన్నినెలల క్రితం వైష్ణవి మృతి..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి (24), హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ‘వైషు అమ్మ’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 17న మృతి చెందింది. అదనపు కట్నం కోసం భర్త హరిబాబు, అతని కుటుంబ సభ్యులు వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అప్పట్లో హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్ పై జైలు నుంచి బయటికొచ్చిన నిందితుడు గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు.

పాత కక్షలే కారణమా?
ప్రస్తుతం హరిబాబు మృతికి పాత కక్షలే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిందితులు దొరికితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు నిందితులు ఎవరు? వారు ఏ జిల్లాకు చెందిన వారు..? వారు ఉపయోగించిన వాహనం ఎవరిది.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.