Ys Sharmila Continuing Initiation Near Lotus Pond
YS Sharmila continuing initiation : లోటస్‌పాండ్ దగ్గర షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. ఇక అంతకుముందు వైఎస్ షర్మిల అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్ వరకు పాదయాత్రగా బయలుదేరిన షర్మిలను.. పోలీసులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో షర్మిల సొమ్మసిల్లిపోగా.. అక్కడే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం లోటస్‌పాండ్‌కు తరలించారు.
షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో ఆమె అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. షర్మిలను వాహనం ఎక్కించి తరలిస్తున్నప్పుడు కూడా అడ్డుకున్నారు. వారిని పోలీసులు ఈడ్చిపడేశారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. అంతకుముందు పాదయాత్ర సమయంలో షర్మిల అనుచరులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. షర్మిల కూడా పోలీసులతో ఘర్షణకు దిగారు.
ఉద్యోగాల భర్తీ డిమాండ్‌తో మూడు రోజుల ఆమరణ దీక్షకు షర్మిల ప్లాన్ చేయగా.. పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో ఇవాళ ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత సమయం ముగియడంతో లోటస్‌పాండ్ వరకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే అలా వెళ్తోన్న క్రమంలోనే షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాదయాత్ర చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు షర్మిల. జూలై 8న పార్టీ ప్రకటించడమే కాకుండా.. పాదయాత్ర తేదీలను కూడా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ యువకులు ప్రాణదానాలు చేస్తుంటే మనసు తరక్కుపోతోందన్నారు షర్మిల. నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు షర్మిల. తనను దీక్ష చేయనీకుంటే.. ఇంటి లోపల ఆమరణ దీక్ష చేస్తానన్నారు. తనకు ఏదైనా జరిగితే తన అనుచరులు చూస్తూ ఊరుకోరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ అనుచరులతో కలిసి షర్మిల స్లోగన్స్ ఇచ్చారు.