YS Sharmila
YS Sharmila Reddy Comments BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమా వెంకటేశ్వరరావులేనని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించిన వాళ్లేనని చెప్పారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో చూపింది గోరంతైతే దాచింది కొండంత అని పేర్కొన్నారు.
లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
Vijayawada Court : పవన్ కళ్యాణ్ పై మహిళా వాలంటీర్ కేసు.. ఫిర్యాదు వెనక్కి పంపిన విజయవాడ కోర్టు
కాగా, ఎన్నికల అఫిడవిట్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. తన ఎన్నిక చెల్లందంటూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఓటర్ రాఘవేంద్ర రాజు పిటిషన్ ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేశారు. ఇప్పటికే హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అయ్యాయి. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వర్ రావుపై అర్హత వేటు వేసింది. అలాగే తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గానూ వనమా వెంకటేశ్వర్ రావుకు రూ.5 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా 2018 నుంచి ఇప్పటివరకు వనమా వెంకటేశ్వర్ రావు ఎమ్మెల్యేగా అర్హుడు కాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపిన అనంతరం వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతని సమీప అభ్యర్ధిగా ఉన్న జలగం వెంకటరావును విజేతగా కోర్టు ప్రకటించింది.