Pranshuk Kanthed : కోట్ల రూపాయల జీతం, అమెరికా ఉద్యోగం వదులుకుని సన్యాసంలోకి యువ సైంటిస్ట్

అమెరికా ఉద్యోగాన్ని, కోట్ల రూపాయల జీతాన్ని, లగ్జరీ లైఫ్ ని వదులుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సన్యాసం స్వీకరించాడు ఆ 28ఏళ్ల యువకుడు.

Pranshuk Kanthed : అమెరికాలో ఉద్యోగం, ఏడాదికి కోటి రూపాయల జీతం, లగ్జరీ లైఫ్, బిందాస్ బతుకు.. ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి. లైఫ్ సెటిల్ అయిపోనట్లే. ఇలాంటి జీవితం అందరికీ రాదు. అందుకే, ఇలాంటి విలాసవంతమైన జీవితాన్ని ఎవరూ వదులుకోరు. కానీ, అతడు మాత్రం డోంట్ కేర్ అన్నాడు. అమెరికా ఉద్యోగాన్ని, కోట్ల రూపాయల జీతాన్ని, లగ్జరీ లైఫ్ ని వదులుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సన్యాసం స్వీకరించాడు ఆ 28ఏళ్ల యువకుడు.

ఏంటి షాక్ అయ్యారు కదూ. ఈ రోజుల్లోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారా? అని నివ్వెరపోతున్నారు కదూ. కానీ, ఇది నిజం. ఆ యువకుడు సన్యాసం స్వీకరించాడు.

ఆ యువకుడి పేరు ప్రన్సుఖ్ కాంతేడ్. వయసు 28 ఏళ్లు. మధ్యప్రదేశ్ కి చెందిన ప్రన్సుఖ్.. ఇంజినీరింగ్ అనంతరం 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడే ఉన్నత చదువులు చదివి డేటా సైంటిస్ట్ గా కొలువు సాధించాడు. ఏడాదికి రూ.1.25 కోట్ల ప్యాకేజీతో జీతం. అయినా, ఆ ఉద్యోగం అతడికి ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. లైఫ్ అంటే ఇంతేనా అనిపించింది. తాను కోరుకున్న జీవితం ఇది కాదనున్నాడు. ఇంకా ఏదో వెలితిగా అనిపించింది. ఆ ఉద్యోగం కానీ, జీతం కానీ.. అతడిలో ఆనందం నింపలేదు. జీవితంలో తనకు మనశ్శాంతి, ప్రశాంతత దక్కలేదని ఫీల్ అయ్యాడు. డబ్బుతో వచ్చే విలాసవంతమైన జీవితం పట్ల అతడికి విముఖత కలిగింది.

ఆ ఉద్యోగం కానీ, ఆ జీతం కానీ అతడిని ఆనందపరచలేదు. దీంతో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోట్ల రూపాయల జీతాన్ని, ఉద్యోగాన్ని, అమెరికాను వదిలేసి భారత్ తిరిగొచ్చేశాడు. ఆడంబరాలను, ప్రాపంచిక సుఖాలను త్యజించి.. అహింసా బోధనే లక్ష్యంగా.. మోక్ష మార్గంగా భావించాడు. క్షణం జీవితానికి ఆనందం లేనప్పుడు, కోట్ల సంపాదనకు ప్రశాంతత లేనప్పుడు.. సాధువుగా మారి సన్యాసిగా జీవించడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు.

గతేడాది స్వదేశానికి తిరిగొచ్చిన ప్రన్సుఖ్.. జైన సన్యాసంపై ఆసక్తి చూపాడు. డిసెంబర్ 26న జైన సన్యాసిగా మారనున్నాడు. జైన మత గురువు జినేంద్ర ముని వద్ద సన్యాస దీక్ష తీసుకోనున్నాడు. ప్రన్సుఖ్ తో పాటు మరో ఇద్దరు యువకులు కూడా సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. వీరికి సన్యాస దీక్ష అందించే కార్యక్రమానికి 50 మందికి పైగా జైన సాధువులు రానున్నారు.

సాధారణంగా అమెరికా ఉద్యోగాన్ని, కోట్లలో వచ్చే జీతాన్ని వదులుకుంటాను, సన్యాసం స్వీకరిస్తాను అంటే.. పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. కానీ, ప్రన్సుఖ్ విషయంలో అలా జరగలేదు. సన్యాసిగా మారతాను అంటే.. అతడి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, అతడి నిర్ణయం పట్ల వారంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.