10 రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేస్తే, కోవిడ్‌ని భారత్‌ జయించినట్లే

కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం(ఆగస్టు-11,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్‌లాక్‌3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక తరఫున ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు.

ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని నరేంద్ర మోడీ తెలిపారు. మోడీ మాట్లాడుతూ…. 10 రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయగల్గితే.. భారత్‌ కోవిడ్‌ని జయించగలుగుతుంది. ఇందుకుగాను బిహార్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కరోనాపై పోరులో నియంత్రణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, నిఘా అనే ఆయుధాలు అత్యంత ప్రభావవంతంగా పని చేశాయి. 72 గంటల్లోపు కోవిడ్‌-19 కేసులను గుర్తిస్తే.. వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు కంట్రోల్‌ చేయవచ్చని నిపుణులు అంచాన వేస్తున్నారని తెలిపారు.

ఇక దేశంలో, మహారాష్ట్రలో అత్యధికంగా కోవిడ్-19 కేసులు ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటివరకు 22.68 లక్షల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు,సోమవారం వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, బిహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.