కలలు కనడం సులభమే, కానీ వాటిని నిజం చేసుకోవడానికి అసాధారణమైన పట్టుదల కావాలి. మంగళూరుకు చెందిన కేఎస్.రితుపర్ణ (20) కథ సరిగ్గా అలాంటిదే. డాక్టర్ కావాలనే ఆమె కల చెదిరిపోయినా, నిరాశపడకుండా ఇంజనీరింగ్ చేసి, ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత రోల్స్ రాయిస్ (Rolls-Royce) కంపెనీలో రూ. 72 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని తెచ్చుకుంది. ఆమె ఈ ఉద్యోగాన్ని ఎలా సాధించిందో తెలుసుకుందాం. ఆమె ఉద్యోగాన్ని సాధించిన తీరు ప్రతి విద్యార్థికీ ఒక పాఠం వంటిది.
ఓటమితో మొదలైన ప్రయాణం
రితుపర్ణ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కంది. కానీ NEET పరీక్షలో ఆశించిన స్కోర్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఆ సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, అయిష్టంగానే ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసింది. 2022లో సాహ్యాద్రి కాలేజ్‌లో రోబోటిక్స్, ఆటోమేషన్ విభాగంలో చేరింది.
మొదట్లో ఎదురైన సవాళ్లు ఇవే..
“ఇంజనీరింగ్ నాకు చాలా కష్టంగా అనిపించింది. మొదట్లో నేను కొన్ని సబ్జెక్టులతో చాలా ఇబ్బందిపడ్డాను” అని రితుపర్ణ గుర్తుచేసుకుంది. కానీ ఆమె పట్టు వదలకుండా, నెమ్మదిగా ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగింది.
రితుపర్ణ ప్రతిభకు ఆమె చేసిన ప్రాజెక్టులే నిదర్శనం. తన మొదటి ప్రాజెక్ట్‌గా, పోక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ఒక యంత్రాన్ని రూపొందించింది. ఇది చెట్లను కత్తిరించడానికి, మందులను పిచికారీ చేయడానికి ఉపయోగపడింది. ఈ ఆవిష్కరణకు గోవాలో జరిగిన పోటీలో బంగారు, రజత పతకాలు లభించాయి.
NIT సూరత్‌కల్‌లో రోబోటిక్ సర్జరీపై జరిగిన పరిశోధనలో పాలుపంచుకుని, తన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచుకుంది. మంగళూరు నగరంలో వ్యర్థాల నిర్వహణ కోసం ఒక మొబైల్ యాప్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించింది.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి?
కేవలం మార్కుల కోసం కాకుండా, నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంపై దృష్టి పెడితే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి. రోల్స్ రాయిస్‌లో ఇంటర్న్‌షిప్ సాధించడం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. కానీ అది అంత సులభంగా రాలేదు.
ఆమె ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించినప్పుడు, అక్కడి మేనేజర్ ఆమెను తేలిగ్గా తీసుకున్నారు. “మీరు అర్హులేనా? ఒక్క నెలలో మీరేం చేయగలరు?” అంటూ నిరుత్సాహ పరిచారు.
అయినా రితుపర్ణ వెనక్కి తగ్గలేదు. ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టుబట్టింది. ఆమెకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, దాన్ని కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
ఆమె కష్టాన్ని, ప్రతిభను గుర్తించిన కంపెనీ, ఆమెకు మరిన్ని బాధ్యతలు అప్పగించింది. 8 నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేసి, చివరికి డిసెంబర్ 2024లో ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందుకుంది.
ఉద్యోగం సాధించాక కూడా ఆమె ప్రయాణం ఆగలేదు. 2024 జనవరి నుంచి, చదువుకుంటూనే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్క్ ఫ్రం హోం చేసింది. ఈ అంకితభావమే ఆమె జీతాన్ని కేవలం నాలుగు నెలల్లోనే రూ. 39.6 లక్షల నుంచి రూ.72.3 లక్షలకు పెరిగేలా చేసింది.
ఆమె విభాగాధిపతి లారెన్స్ జోసెఫ్ ఫెర్నాండిస్ మాట్లాడుతూ.. “రితుపర్ణ సాధించిన విజయం మాకెంతో గర్వకారణం. ఆమె అంకితభావం, పట్టుదల ఇతర విద్యార్థులకు గొప్ప స్ఫూర్తి” అని ప్రశంసించారు.