అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న భారతీయుడు శుభాంశు శుక్లా.. స్ప్లాష్‌డౌన్‌ సక్సెస్‌.. వీడియో

ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా వారు ఐఎస్ఎస్ వెళ్లిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న భారతీయుడు శుభాంశు శుక్లా.. స్ప్లాష్‌డౌన్‌ సక్సెస్‌.. వీడియో

Shubhanshu Shukla

Updated On : July 15, 2025 / 9:13 PM IST

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి శుభాంశు శుక్లా టీమ్‌ భూమి మీదకు చేరుకుంది. కాలిఫోర్నియాలోని శాన్ డియేగో ( పసిఫిక్ మహాసముద్రం) తీరానికి సమీపంలో స్ప్లాష్‌డౌన్‌ విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.02 గంటలకు శుభాంశు శుక్లా భూమిని తాకాడు.

ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా వారు ఐఎస్ఎస్ వెళ్లిన విషయం తెలిసిందే. డ్రాగన్ అంతరిక్ష నౌకలో శుభాంశు శుక్లా టీమ్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 22 గంటలకు పైగా సమయం పట్టింది. ఐఎస్ఎస్‌పై 19 రోజులు గడిపి, మొత్తంగా దాదాపు 20 రోజులు అంతరిక్షంలో ఉన్నారు శుభాంశు శుక్లా.

భూమిపైకి దిగిన శుభాంశును చూసి ఆయన పేరెంట్స్ ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. కాగా, అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి జూన్‌ 25న నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఆ తదుపరి రోజు ఆ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానమైంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా వైమానిక దళ పైలట్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. 1984లో భారతీయుడు రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ శుభాంశు శుక్లా ప్రతిష్ఠాత్మక యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్‌ వెళ్లారు.

భారతీయుడు ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. శుభాంశుతో పాటు ఐఎస్‌ఎస్‌కు పెగ్గీ విట్సన్ (అమెరికా), ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగేరి) వెళ్లివచ్చారు. వారు అక్కడే పరిశోధనలు చేశారు.