IPL స్టార్ కామెంటేటర్ మృతి

IPL స్టార్ కామెంటేటర్ మృతి

Updated On : September 24, 2020 / 7:57 PM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్.. డీన్‌ జోన్స్‌(59) మరణించారు. గురువారం గుండె పోటుకు గురైన డీన్‌జోన్స్‌ ట్రీట్‌మెంట్ అందించేలోపే కనుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్‌ ముంబైలో ఉన్నారు. ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్‌ ఆడారు. ప్లేయర్‌గా కెరీర్‌ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు.

1984-1992 మధ్య కాలంలో ఆసీస్‌ తరఫున క్రికెట్‌ ఆడిన జోన్స్‌… టెస్టు క్రికెట్‌లో 3వేల 631 పరుగుల్ని జోన్స్‌ సాధించగా, అందులో 11 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉ‍న్నాయి. టెస్టు కెరీర్‌లో 2 డబుల్‌ సెంచరీలు సాధించాడు. వన్డే కెరీర్‌లో 7 సెంచరీలు, 46 హాఫ్‌ సెంచరీల సాయంతో 6వేల 68 పరుగులు సాధించారు. 1986లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జోన్స్‌ డబుల్‌ సెంచరీ సాధించారు. జోన్స్‌ వీరోచిత బ్యాటింగ్‌తో ఆసీస్‌ ఓడిపోయే టెస్టు మ్యాచ్‌ను టైగా ముగించింది.



 

జోన్స్‌ మృతిని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ కన్ఫామ్ చేసింది. ‘జోన్స్‌ ఇకలేరు. ఇది చాలా విషాదకరం. ఇది తెలియజేయడం మనసుల్ని కలిచివేస్తోంది. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో జోన్స్‌ ప్రాణాలు విడిచారు. అతని మృతికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆస్ట్రేలియా హై కమిషన్‌తో మాట్లాడుతున్నాం.’

‘జోన్స్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దక్షిణాసియాలో క్రికెట్‌ అభివృద్ధి చెందడానికి జోన్స్‌ ఎంతో కృషి చేశారు. ఈ గేమ్‌కు ఆయనొక గొప్ప అంబాసిడర్‌. ఎప్పుడూ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుండే వారు. కామెంటరీలో ఆయనది సపరేట్ స్టైల్. ఒక చాంపియన్‌ కామెంటేటర్‌. జోన్స్‌ కామెంటరీకి లక్షలాది మంది అభిమానులున్నారు. మాతో పాటు ఫ్యాన్స్‌ కూడా మిస్సవుతున్నందుకు బాధపడుతున్నాం’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.