దమ్యంతి హింగోరాణి గుప్తా.. ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఉద్యోగం పొందిన తొలి మహిళా ఇంజనీర్‌గా చరిత్రలో పేరును లిఖించుకున్న ఆమె అతివలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమ కంపెనీలో మహిళలను నియమించుకోవడానికి అంగీకరించని ఫోర్డ్ సంస్థ విధానాలను మార్చిన ఘనత కూడా ఆమెదే. దాదాపు రూ.3.3 లక్షల కోట్ల విలువ ఉన్న అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థకు సవాల్ విసిరి మరీ అప్పట్లోనే ఉద్యోగాన్ని సాధించడమే కాకుండా, కోట్లాది మంది మహిళలకు ఓ దిశను చూపించారు.
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన తొలి మహిళ కూడా దమ్యంతే. ఆ కాలంలో మహిళలు ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ప్రవేశించటం చాలా అరుదు. అయితే దమ్యంతి తన సంకల్పంతో అటువంటి నిర్బంధాలను ఛేదించి, భారత మహిళలకు సాంకేతిక విద్యలో కొత్త మార్గం చూపించారు.
ఆమె జీవిత ప్రయాణం తలచుకుంటే ఒక మహిళ ఏమి సాధించగలదో, ఆమెకు అవకాశం కల్పిస్తే ప్రపంచం ఎలా మారుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. 1942లో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ఓ ప్రాంతంలో జన్మించారు దమ్యంతి హింగోరాణి. ఆమె కుటుంబం 1947 దేశ విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చింది. చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉండే దమ్యంతి.. కేవలం 13 ఏళ్ల వయస్సులోనే ఇంజనీర్ అవ్వాలన్న అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
నెహ్రూ మాటలతో స్ఫూర్తి
ఆ కాలంలో భారతదేశంలో స్త్రీలు ఇంజినీరింగ్ వంటి రంగాల గురించి కనీసం ఆలోచన కూడా చేయకపోయేవారు. అయితే దమ్యంతి ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మాటలు తనకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని దమ్యంతి హింగోరాణి గుర్తు చేసుకుంటారు.
“దేశ అభివృద్ధికి ఇంజినీర్ల అవసరం ఉంది. పురుషులే కాకుండా మహిళలూ ఇంజినీర్లు కావాలి” అని చెప్పిన నెహ్రూ మాటలు విని, ఆమె ఇంజినీరింగ్ చదవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అది సులభం కాదని తెలిసినా, ఆమె వెనకాడలేదు. స్కూల్ పూర్తి చేసిన తర్వాత దమ్యంతి భారత్‌లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తొలి మహిళగా నిలిచారు. అక్కడ ఆమె మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీను విజయవంతంగా పూర్తి చేశారు.
ఆ కాలంలో భారతదేశంలో మహిళలు ఇంజనీరింగ్, ఫిజిక్స్ వంటి కోర్సులు చదవడం చాలా అరుదు కావడంతో, ఆమె చదువుతున్న కాలేజీలో స్త్రీల కోసం మరుగుదొడ్డి కూడా లేదు. దాంతో దమ్యంతి హింగోరాణి తన అవసరాల కోసం రోజూ సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చేవారు. ఇలాంటి కష్టాలు ఎదురైనా, ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా అన్ని అడ్డంకులను జయించి, మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని సాధించి తన కలను నిజం చేసుకున్నారు.
ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రముఖ అమెరికన్ పరిశ్రమదారు హెన్రీ ఫోర్డ్‌కి దమ్యంతి హింగోరాణి ఓ అభిమాని. హెన్రీ ఫోర్డ్ జీవిత చరిత్ర ఆమెను ఎంతో ప్రభావితం చేసింది. దీంతో ఆయన స్థాపించిన కంపెనీలోనే ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో దమ్యంతి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఆమె 1967లో తన కుటుంబంతో పాటు (తల్లి, ముగ్గురు సోదరులతో) కలిసి అమెరికాకు వలస వెళ్లారు.
ఇంటర్వ్యూకు వెళ్లి.. కంపెనీ విధానమే మారేలా చేసి..
హెన్రీ ఫోర్డ్ స్థాపించిన ఫోర్డ్ మోటార్ కంపెనీలో దమ్యంతి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ కంపెనీ అప్పటికీ మహిళా ఇంజినీర్లను నియమించుకోవద్దనే పాత విధానాన్ని అనుసరిస్తుండటంతో, ఆమె దరఖాస్తును ఆ కంపెనీ ప్రతినిధులు తక్షణమే తిరస్కరించారు. ఈ నిర్ణయం దమ్యంతిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయినప్పటికీ ఆమె ఉత్సాహం కోల్పోకుండా, తాను కోరుకున్న ఫోర్డ్ కంపెనీలో పని చేయాలనే లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగారు.
హింగోరాణి ఫోర్డ్ అధికారులను తన ప్రశ్నలతో ఎదురు ప్రశ్నించారు. “మహిళలు మంచి ఇంజినీర్లవుతారో.. కారోనన్న విషయాన్ని వాళ్లకి అవకాశం ఇవ్వకుండానే మీరు ఎలా తెలుస్తుంది?” అని దమ్యంతి నిలదీశారు. ఆమె చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల ఫోర్డ్ సంస్థ అధికారులను ఎంతో ప్రభావితం చేసింది. దీంతో వారు తమ పాత నియామక విధానాన్ని మార్చి ఆమెను సంస్థలో ఉద్యోగానికి ఎంపిక చేశారు.
దమ్యంతి హింగోరాణి ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఏకంగా 35 సంవత్సరాలు పనిచేశారు. ఆమె వేసిన ఆ మార్గం ద్వారా తరువాతి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది మహిళలు ఆ సంస్థలో ఉద్యోగాలు పొందారు.