AP Weather Updates : వామ్మో.. ఏపీలోని ఈ ప్రాంతాల ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ.. రైతులు జాగ్రత్త..

AP Weather Updates : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది.

AP Weather Updates

  • ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
  • ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • ఆదివారం కూడా ఎండల తీవ్రత ఎక్కువే
  • ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
  • ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

AP Weather Updates : ఏపీలో భిన్నవాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు సాయంత్రం వేళల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భిన్న వాతావరణంతో ఏపీలోని రైతులు, అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Also Read : Chandrababu Naidu : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఏపీలో తాజా పరిణామాలపై చర్చ

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 45 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా నూజెండ్లలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 17 జిల్లాల్లో 239 మండలాల్లో 41డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదివారం ఇలా..
ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరులో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఎండలతోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

ప్రజలకు బిగ్ అలర్ట్..
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మధ్యాహ్నం సమయాల్లో ప్రజలకు బయటకు రావొద్దని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా.. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇంట్లో ఉన్నవారు, బయటకు వెళ్లేవారు ఎప్పటికప్పుడు తగినంత వాటర్ తీసుకోవాలని సూచించారు. వడగాల్పుల నుంచి జాగ్రత్తలు పాటించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

రైతులు జాగ్రత్త..
ఏపీలో ఎండల తీవ్రతతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాగుచేసిన పంటల ఉత్పత్తులు చేతికొచ్చే సమయం కావడంతో.. తమ పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని, వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులతో కూడిన వర్షాల నేపథ్యంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు.