Tata Tiago EV
Tata Tiago EV: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీకి ఎవరూ ఊహించని విధంగా స్పందన వచ్చింది. దేశంలో ఈ కారు బుకింగులు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్ కొత్తగా ప్రవేశ పెడుతున్న ఈ కార్లకు కేవలం ఒక్కరోజులోనే 10,000కు పైగా బుకింగులు రావడం గమనార్హం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వాడితే పర్యావరణానికి మంచిదని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. టియాగో ఈవీకి భారీ స్పందన రావడంతో ఈవీలపై ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టం అవుతోంది.
మోటార్స్ కొత్తగా ఈ కార్లను మార్కెట్లో ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో మొదట బుక్ చేసుకున్న వారికి వీటిని ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య అందిస్తున్నట్లు ప్రకటించింది. పలు వేరియంట్లలో ఈ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంచనాలకు మించి ఆర్డర్లు రావడంతో ఇప్పుడు కొత్తగా బుక్ చేసుకునే మరో 10,000 మందికి అదే ధరకు టియాగో ఈవీని అందిస్తామని టాటా మోటార్స్ చెప్పింది.
బుకింగుల కోసం టోకెన్ ధర రూ.21,000ను ఆన్ లైన్ లేదా ఏదైనా టాటా డీలర్ షిప్ వద్ద చెల్లించాల్సి ఉంటుంది. టాటా టియాగో ఈవీ టెస్ట్ డ్రైవ్ డిసెంబరులో ప్రారంభం అవుతుంది. వీటి డెలివరీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు ఎక్స్ఈ, ఎక్స్‌టీ మీడియం రేంజ్ వేరియంట్లు 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో, లాంగ్ రేంజ్ కార్లు 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి.
19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తున్న వేరియంట్ కార్లు ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు, 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తున్న కార్లు ఒకసారి రీచార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 7.2 కేడబ్యూ చార్జెర్‌తో లాంగ్ హయ్యర్ ఎండ్ కార్ వేరియంట్లు 3 గంటల 36 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తాయి. అలాగే, డీసీ ఫాస్ట్ చార్జర్ 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ చేస్తుంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..