మీలో ఈ 6 సమస్యలు ఉంటే.. కరోనాతో మరణించే ముప్పు ఉందో లేదో చెప్పేయొచ్చు!

  • Publish Date - July 20, 2020 / 05:04 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా వైరస్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఒకవైపు వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూ తన జన్యు క్రమాన్ని కూడా మార్చుకుంటూ మరింత ప్రాణాంతకంగా మారుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపట్టినా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా మందుస్తు అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా తీవ్రత ప్రాణాంతకంగా మారుతుంది.
వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఈ వైరస్ విజృంభిస్తోంది.. రికవరీ రేటు సానుకూలంగా ఉన్నప్పటికీ మరణాల రేటు భయాందోళన గురిచేస్తోంది. కరోనా సోకిన వారిలో ఎవరికి ప్రాణాంతకమనేది తప్పక గుర్తించాల్సిన విషయం.. దీనిపై నిర్వహించిన ఓ కొత్త అధ్యయనాన్ని Journal of American Medical Associationలో ప్రచురించారు. ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన వారిలో మరణించే అవకాశాలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయో ఈ అధ్యయనం తేల్చింది.

ఇందులో భాగంగా అమెరికా వ్యాప్తంగా మార్చి నుంచి ఏప్రిల్ వరకు 65 ఆస్పత్రుల్లో 2,215 మంది కరోనా రోగులను పరీక్షించారు. వైరస్ సోకిన వారిలో 875 మంది మరణించారు. కరోనాతో మరణించివారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో గుర్తించారు. కరోనాతో మరణ ముప్పుకు ఈ 6 కారకాలను ప్రధానంగా పరిశోధకులు తేల్చేశారు. అవేంటో ఓసారి చూద్దాం..
1. 60 ఏళ్ల దాటితే (వృద్ధాప్యం):
కరోనా వైరస్ ముప్పు అత్యధికంగా 60 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా ఉంటుందని JAMA రిపోర్టు ధ్రువీకరించింది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కరోనావైరస్ కారణంగా మరణించడానికి మూడు రెట్లు అవకాశం ఉందని గుర్తించారు. 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వైరస్ బారిన పడే అవకాశం 11 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

2. పురుషుల్లోనే అధికం :
అధ్యయనం ప్రకారం.. కరోనావైరస్.. మహిళల్లో కంటే పురుషుల్లోనే ప్రభావం ఎక్కువనే ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చేశాయి. అయితే కరోనా సోకిన పురుషుల్లో మరణించే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా గుర్తించారు.

కొన్ని కొమొర్బిడిటీలు స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ ముప్పు అధికంగా ఉంటుందని తేల్చేశారు. COVID విషయానికి వస్తే లింగ విభజన మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

3. ఊబకాయం (స్థూలకాయం) :
అధిక బరువు ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయంతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. శరీరంలోని అనేక భాగాలపై ఊబకాయం ప్రభావం పడుతుంది.

రోగనిరోధక శక్తి కూడా బలహీన పడుతుంది. JAMA అధ్యయనం ప్రకారం.. 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు‌లో BMI ఉన్నవారు, తీవ్రమైన ఊబకాయం ఉన్నవారు, వైరస్‌తో మరణించే అవకాశం 1.5 రెట్లు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు.

4. కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారిలో :
కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్న పేషెంట్లు (రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, దీర్ఘకాలిక obstructive pulmonary వ్యాధితో సహా) కూడా COVID-19కు గురయ్యే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది.
గుండె సంబంధిత వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలోనూ కరోనా ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు

5. క్యాన్సర్ వ్యాధి :
క్యాన్సర్ రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ సంబంధింత సమస్యలు ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే మరింత ప్రాణాంతకమని పరిశోధకులు అంటున్నారు.

క్యాన్సర్ రోగులకు ఒకవేళ కరోనా సోకితే వైరస్ తో పోరాడటం చాలా కష్టమని అంటున్నారు. COVID కారణంగా క్యాన్సర్ రోగులు చనిపోయే అవకాశం 2 రెట్లు ఎక్కువ అని అధ్యయనం సూచిస్తోంది.

6. ఐసీయు బెడ్ కొరత :
ఇది వ్యక్తిగత అనారోగ్య సమస్య కాకపోవచ్చు.. కానీ, COVID-19 సోకిన రోగి ఆస్పత్రిలో చేరినప్పుడు ఐసీయూ పడకల కొరత అధికంగా ఉంటే మరణించే అవకాశం గణనీయంగా పెరిగిందని JAMA నివేదిక పేర్కొంది.

తక్కువ ఐసియు పడకలు ఉన్న ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగులకు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. సరైన వైద్య సదుపాయాలు లేక.. సకాలంలో వైద్య సాయం అందక కూడా చాలామంది కరోనా రోగులు మరణించే అవకాశం ఉంటుందని నివేదిక వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు