రోహిత్ శర్మను వెళ్లగొట్టడానికే అంత కఠినమైన ఫిట్‌నెస్ టెస్ట్.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలనం

బ్రోంకో టెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఈ ఆలోచన ఎవరిది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరి ఒత్తిడి ఉంది?

రోహిత్ శర్మను వెళ్లగొట్టడానికే అంత కఠినమైన ఫిట్‌నెస్ టెస్ట్.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలనం

Rohit Sharma - Bronco Test

Updated On : August 26, 2025 / 3:43 PM IST

Bronco Test: బీసీసీఐ తాజాగా ప్రవేశపెట్టిన “బ్రోంకో ఫిట్‌నెస్ టెస్ట్” రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లను 2027 వన్డే వరల్డ్ కప్‌ నుంచి దూరం చేసేందుకేనంటూ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన కామెంట్స్‌ చేశారు.

రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రాబోయే వన్డే వరల్డ్ కప్‌ 2027లో ఆడాలని తాను కోరుకుంటున్నానని పబ్లిక్‌గా ప్రకటించాడు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తివారీ మాట్లాడుతూ.. వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా? అన్న అంశాలపై స్పందించారు. (Bronco Test)

కోహ్లీని జట్టులో నుంచి తొలగించడం కష్టమని, కానీ కొత్త ఫిట్‌నెస్‌ టెస్ట్‌ను మాత్రం రోహిత్‌ను జట్టులోంచి దూరం చేయడానికే తెచ్చారని తివారీ అన్నారు.

“విరాట్ కోహ్లీని 2027 వరల్డ్ కప్ ప్లాన్స్‌ నుంచి బయటపెట్టడం చాలా కష్టం అని నేను భావిస్తున్నాను. కానీ, రోహిత్ శర్మను మాత్రం ఆ ప్లాన్లలో భాగంగా చూడడం లేదనే అనుమానం నాకు ఉంది.

ఎందుకంటే నేను భారత క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలను గమనించే వ్యక్తిని. బ్రోంకో టెస్ట్‌ను కొన్ని రోజుల క్రితం తీసుకొచ్చారు.

రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించడానికే దాన్ని తీసుకొచ్చారని నేను నమ్ముతున్నాను” అని తివారీ అన్నారు.

“బ్రోంకో టెస్ట్ ఇప్పటివరకు భారత క్రికెట్‌లో తీసుకువచ్చిన కఠినమైన ఫిట్‌నెస్ టెస్టుల్లో ఒకటి.

కానీ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఈ ఆలోచన ఎవరిది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరి ఒత్తిడి ఉంది?

దీనికి సమాధానం నాకు తెలియదు. కానీ, నా పరిశీలన ప్రకారం రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై చాలా కష్టపడకపోతే ఇబ్బందులు వస్తాయి. బ్రోంకో టెస్ట్ దగ్గరే అతడిని ఆపేస్తారని నేను భావిస్తున్నాను” అని తివారీ తెలిపారు.

తివారీ 2011 వరల్డ్ కప్ తర్వాత కూడా ఇలాంటి పరిణామం జరిగిందని గుర్తు చేశారు.

అప్పుడు యో-యో టెస్ట్ తీసుకొచ్చి గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్‌లాంటి దిగ్గజాలను జట్టులోంచి దూరం చేశారని అన్నారు.

బ్రోంకో టెస్ట్ అంటే ఏంటి?

బ్రోంకో టెస్ట్ రగ్బీతో పాటు ఇతర క్రీడల్లో ఎక్కువగా ఉపయోగించే రన్నింగ్ టెస్ట్. ఆటగాళ్ల స్థైర్యం, వేగం, మానసిక బలాన్ని అంచనా వేయడానికి దీన్ని పెడతారు.

ప్లేయర్లు 20, 40, 60 మీటర్ల దూరాల్లో ఉన్న మూడు మార్కర్ల మధ్య పరుగులు తీస్తారు. మొదట 60 మీటర్లు వెళ్లి వచ్చి, తర్వాత 40 మీటర్లు వెళ్లి వచ్చి, చివరగా 20 మీటర్లు వెళ్లి వస్తారు.