పోలీసులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్లు.. రైతు మృతి.. బుల్లెట్ తగిలిందా?

వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు దద్దరిల్లాయి. గణతంత్రాన రైతులు చేస్తున్న ట్రాక్టర్ల పరేడ్.. ఉద్రిక్తలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చారిత్రాత్మక కవాతు దేశ ప్రజల భవిష్యత్తు కోసమని రైతులు చెబుతుండగా.. శాంతియుతంగా చేస్తున్న కవాతులో పోలీసులు రణరంగం సృష్టించినట్లు రైతులు చెబుతున్నారు.

గణతంత్ర దినోత్సవం నాడే ఎర్రకోట సాక్షిగా అబ్బురపరిచే సైనిక విన్యాసాలు, పలు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తూ సాగే శకట దరహాసాలు తమ కవాతును చేస్తుండగా.. చారిత్రాత్మక ట్రాక్టర్‌ పరేడ్‌లో పోలీసులు రైతులకు మధ్య విపరీతంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీపై పోలీసులు విరుచుకుపడ్డారు.

ఎర్రకోట ప్రాకారాలపై రైతులు జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించగా, ITO దగ్గర పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించినట్లుగా రైతులు ఆరోపించారు. అదే సమయంలో ఢిల్లీ పోలీసులతో పాటు ట్రాక్టర్లను తీసుకువచ్చిన కొంతమంది రైతులు ట్రాక్టర్లను పోలీసులపైకి పోనిస్తూ బయపెట్టే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఢిల్లీలోని ఐటిఓలో రైతులు, జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసుల కాల్పుల్లో ఉత్తరాఖండ్ రైతు చనిపోయినట్లుగా రైతుల బృందం వెల్లడించింది. ఆ వ్యక్తిని నవనీత్‌గా గుర్తించారు. రైతులు అతనిని పోలీసులు కాల్పుల్లో చంపినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు మాత్రం అతను విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పి పడిపోయి చనిపోయినట్లు చెబుతున్నారు. చనిపోయిన రైతుపై జాతీయ జెండాను కప్పి నివాళులు అర్పిస్తున్నారు రైతులు.

ట్రెండింగ్ వార్తలు